ఈనెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు బుధవారం నాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి.
ఇదిలావుంటే.. ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపై స్పందించారు. ప్రధాని మోదీ కొత్త భవనాన్ని ప్రారంభించకూడదని అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆ బిల్డింగ్‌ను ఆవిష్కరించకుంటే.. ఆ వేడుకకు తాము హాజరుకాబోమని ఎంఐఎం చీఫ్ అసద్ తెలిపారు.