బాల్య వివాహాలపై భారీ అణిచివేత.. 1800 మందికిపైగా అరెస్ట్‌

1,800 held in Himanta Biswa’s child marriage crackdown in Assam. బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా

By అంజి  Published on  3 Feb 2023 8:43 AM GMT
బాల్య వివాహాలపై భారీ అణిచివేత.. 1800 మందికిపైగా అరెస్ట్‌

బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో చేపట్టిన అణచివేతలో అసోంలో శుక్రవారం 1,800 మందిని అరెస్టుచేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ''బాల్య వివాహాల నిషేధ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. 1800+ మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు'' అని శర్మ ట్వీట్ చేశారు. బాల్య వివాహాల విషయంలో ఎంతమాత్రం సహనం చూపవద్దని పోలీసులను కోరినట్లు అస్సాం సీఎం తెలిపారు.

"మహిళలపై క్షమించరాని, క్రూరమైన నేరాలకు వ్యతిరేకంగా సహనంతో వ్యవహరించ వద్దని నేను అస్సాం పోలీసులను కోరాను'' అని శర్మ తెలిపారు. బాల్య వివాహాలను అంతం చేయాలనే ధృడ సంకల్పంతో అస్సాం ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలపై అస్సాం పోలీసులు 4004 కేసులు నమోదు చేయడం గమనార్హం, మూడు రోజుల్లో చాలా అరెస్టులు పూర్తవుతాయని భావిస్తున్నారు. జిల్లాల వారీగా నమోదైన కేసులను విడదీస్తూ, ఫిబ్రవరి 3 నుండి కేసులపై చర్యలు ప్రారంభమవుతాయని హిమంత బిశ్వ శర్మ నిన్న తెలియజేసారు.

తదనుగుణంగా, పోలీసులు గత రాత్రి నుండి కేసులలో పేర్కొన్న వ్యక్తులను అరెస్టు చేయడం ప్రారంభించారు. రానున్న రోజుల్లో పోలీసులు మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉందని సీఎం తెలిపారు. అస్సాంలో తక్కువ వయస్సు గల బాలికలను వివాహం చేసుకున్న వేలాది మంది పురుషులను అరెస్టు చేస్తామని శర్మ గురువారం నాగాన్ జిల్లాలో తెలిపారు. జనవరిలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం ప్రారంభించిన అణిచివేత నేపథ్యంలో అతని ఈ ప్రకటన వచ్చింది. నాగావ్, కొన్ని ఇతర జిల్లాలలో అధిక శాతం బాల్య వివాహాలు (42 శాతం) నమోదవుతున్నాయి. 18 సంవత్సరాల వయస్సు (15 శాతం) రాకముందే స్త్రీలు ప్రసవిస్తున్నారు.

సిఎం అందించిన డేటా ప్రకారం.. 4004 కేసులలో, ధుబ్రి జిల్లాలో అత్యధికంగా 370 నమోదయ్యాయి. హోజాయ్‌లో 255, ఉద్దల్‌గురిలో 235, మోరిగావ్‌లో 224, కోక్రాజార్‌లో 204, గౌహతిలో 192 మంది ఉన్నారు. హైలకండిలో అత్యల్ప కేసు కేవలం 1 మాత్రమే ఉంది. రాష్ట్రంలో బాల్య వివాహాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటామని జనవరి 23న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అస్సాం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత బాల్య వివాహాలపై అణిచివేత ప్రారంభమైంది. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న పురుషులపై పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా వధువు వయస్సు 14 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న వారిపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story