చెత్తకుప్పలో 17 పిండాలు
17 Foetuses found in Uluberia dump in West Bengal.చెత్త కుప్పలో 17 మానవ పిండాలు కలకలం సృష్టించాయి.
By తోట వంశీ కుమార్ Published on 17 Aug 2022 5:13 AM GMTచెత్త కుప్పలో 17 మానవ పిండాలు కలకలం సృష్టించాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది.
కోల్‌కతాకు 45 కిలోమీటర్ల దూరంలోని హౌరాలోని ఉలుబెరియా మున్సిపాలిటీ పరిధిలోని వారు నెంబర్ 31లో గల బనిబాలా ఖారాలోని చెత్త కుండీలో మంగళవారం 17 పిండాలను స్వీపర్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పాలిథిన్ సంచుల్లో చుట్టబడిన17 పిండాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పది ఆడ, ఆరు మగ పిండాలుగా గుర్తించారు. ఓ పిండం అభివృద్ధి చెందకపోవడంతో దాన్ని గుర్తించలేకపోయామని పోలీసులు తెలిపారు. అన్ని పిండాలను పోస్టు మార్టం నిమిత్తం ఉలుబెరియా సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు.
ఆరోగ్య శాఖకు సమాచారం అందించామని, పోస్టు మార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. చుట్టు పక్కల 25 నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయన్నారు. ఈ పిండాలని మెడికల్ వేస్టేజ్‌గా పడేశారా లేదా బ్రూణహత్యలు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉలుబేరియా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభయ్ దాస్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే సోమవారం అన్ని నర్సింగ్‌హోమ్‌ల సీనియర్ అధికారులను సమావేశానికి పిలిచినట్లు తెలిపారు. సమావేశానికి వచ్చేటప్పుడు ఆసుపత్రి రిజిస్టర్లను తమ వెంట తీసుకురావాలని ఆదేశించారు. గత కొన్ని వారాలుగా ఆయా హోమ్స్‌లో నిర్వహించిన శ్రస్త చికిత్సల పూర్తి వివరాలు అందులో ఉండాలన్నారు.
ఇలాంటి ఘటనే ఈ జూన్ 25న కర్ణాటకలో వెలుగు చూసింది. కర్ణాటకలోని బెలగావి జిల్లా మూడలగి గ్రామ శివార్లలో ఒక డబ్బాలో ఏడు అబార్షన్ చేసిన పిండాల అవశేషాలు బయటపడిన విషయం తెలిసిందే.