ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో ఏటవాలులో వాహనం అదుపు జారిపోవడంతో 16 మంది ఆర్మీ జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ వాహనం మూడు వాహనాల కాన్వాయ్‌లో భాగం. ఇది ఉదయం చటెన్ నుండి థంగు వైపుకు వెళ్లింది. జెమా వద్ద మార్గమధ్యంలో వాహనం ప్రమాదానికి గురైంది. "రెస్క్యూ మిషన్ వెంటనే ప్రారంభించబడింది. గాయపడిన నలుగురు సైనికులను ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు, 13 మంది సైనికులు మృతి చెందారు" అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ''ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి సేవ, నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను'' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.