ఆ జైలులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ
140 Inmates Test HIV Positive In Uttar Pradesh's Dasna Jail.దస్నా జిల్లాజైలులో మొత్తం 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ ఉన్నట్లు
By తోట వంశీ కుమార్ Published on 19 Nov 2022 12:28 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని దస్నా జిల్లా జైలులో మొత్తం 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు జైలు సీనియర్ అధికారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జైలులో ఉంచే ముందు ఖైదీలందరికీ హెచ్‌ఐవీ పరీక్షలు చేస్తారు.
ఘజియాబాద్ జైలులోని ఖైదీలను ఎంఎంజీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు తనిఖీ చేస్తారని జిల్లా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. 2016లో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జైళ్లలో హెచ్ఐవీ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించింది. ఆ సమయంలో ఘజియాబాద్ జైలులో 49 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకినట్లు తేలిందన్నారు.
ఆ తర్వాత ప్రభుత్వం సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా హెచ్ఐవీ మరియు టీబీ పరీక్షలను కొత్త ఖైదీలందరికీ తప్పనిసరి చేసింది. ఖైదీకి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే.. జైలు లోపల ఉన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్ (ICTC)లో అతనికి లేదా ఆమెకు ఏఆర్‌వీ చికిత్స అందించబడుతుంది.
దాస్నా జైలు ప్రస్తుతం ఖైదీలతో కిక్కిరిసిపోయింది. జైలులో 1706 మంది ఖైదీలను ఉంచేందుకే సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం 5,500 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 140 మందికి హెచ్ఐవీ నిర్థారణ అయ్యింది. 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఇక 2016 నుంచి ఇప్పటి వరకు సగటున 120 నుంచి 150 మంది హైచ్ఐవీ ఖైదీలు జైలులో ఉన్నారని అలోక్ సింగ్ తెలిపారు.