మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలిలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒకరిద్దరు కాదు ఏకంగా 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎటపల్లి పరిధిలోని పేడి-కోటమి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య శుక్రవారం తెల్లవారుజామున భీకర కాల్పులు జరిగాయి. కాసన్‌పూర్ దళానికి చెందిన మావోయిస్టులు పొగాకు ఒప్పందానికి సంబంధించి స్థానికులతో సమావేశం ఏర్పాటు చేస్తన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా పోలీసులు సమాచారం అందించింది.
దీంతో అప్రమత్తమైన సి-60 యూనిట్ కమాండోలు జాగ్రత్తగా కుంబింగ్ మొదలుట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టులు వారిని గుర్తించి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చింది. ఘటనలో 13 మంది మావోలు హతమయ్యారు. ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో గాలింపు జరిపిన పోలీసులు మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం, ఇతర నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్నారు.. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని సమాచారం. అటవీ ప్రాంతంలో ఇప్పటికీ కూంబింగ్ కొనసాగుతోంది. కూంబింగ్ లో మొత్తం 60 మంది పోలీసులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.