ఒకే అపార్ట్‌మెంట్‌లో 103 మందికి కరోనా పాజిటివ్
103 test positive for Covid-19 in Bengaluru apartment after a party. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఏకంగా 103 మందికి కరోనా పాజిటివ్ తేలడం సంచలనంగా మారింది.
By Medi Samrat Published on 17 Feb 2021 2:07 AM GMTకరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ విజృంభిస్తోంది. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఏకంగా 103 మందికి కరోనా పాజిటివ్ తేలడం సంచలనంగా మారింది. వీరంతా కాంప్లెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరు కావడంతో ఇంత మందికి పాజిటివ్ తేలింది. ఈ ఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 4న బొమ్మనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో అపార్ట్‌మెంట్ వాసులందరూ పాల్గొన్నారు. అనంతరరం వారిలో కొందరు దేహ్రదూన్ ట్రిప్‌కు వెళ్లేందుకు గానూ కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈనెల 10న ఫలితాలు వచ్చాయి. వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే అప్రమత్తమై అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ వారికి సమాచారం అందించారు. వారు బీబీఎంపీ అధికారులను సంప్రదించి అపార్టుమెంట్ వాసులందరికీ కరోనా పరీక్షలు చేయించారు.
ఆ అపార్టుమెంట్‌లో ఉన్న 1,052 మందికి టెస్టులు చేయగా, వారిలో 103 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారిలో 96 మందికి 60 ఏళ్లకు పైబడిన వారేనని బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. అయితే పాజిటివ్ తేలిన వారిని ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన వివరించారు. అపార్టుమెంట్‌లో ఉన్న అందరిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మందికి లక్షణాలు లేవని బీబీఎంసీ అదనపు కమిషనర్ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ నియమాల ప్రకారం ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. అపార్టుమెంట్ నిర్వాసితులకు అవసరమైన అన్ని వస్తువులను వారికి అందిస్తామని ఆయన తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఏవైన కరోనా వేరియంట్లు ఉంటే గుర్తించేందుకు అందరి నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్ కు పంపామని అధికారులు తెలిపారు.