ఢిల్లీలో నేడు దాదాపు 10,000 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. పాజిటివిటీ రేటు దేశ రాజధానిలో 10 శాతానికి పెరుగుతుందని ఆయన అన్నారు. పాజిటివిటీ రేటు నిన్న 8.3 శాతంగా ఉంది. సోమవారం 6.46 శాతం నుండి ఇది గణనీయంగా పెరుగుతూ వస్తోంది. భారతదేశంలో థర్డ్ వేవ్ ఏర్పడిందని.. "ఢిల్లీకి ఇది పిప్త్ వేవ్" అని మంత్రి జైన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఓమిక్రాన్ యొక్క లక్షణాలు తేలికపాటివిగా కనిపిస్తున్నప్పటికీ.. కోవిడ్-సంబంధిత అన్ని ప్రోటోకాల్‌లకు ప్రజలు కట్టుబడి ఉండాలని అన్నారు.
కేసుల పెరుగుదలతో ఢిల్లీలో ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలం కాకుండా చూసేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 40 శాతం పడకలను రిజర్వ్ చేసినట్లు మంత్రి తెలిపారు. అన్ని నమూనాలను సీక్వెన్సింగ్ చేయడం సాధ్యం కానందున.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీ నుండి 300-400 నమూనాలను మాత్రమే పంపుతున్నట్లు చెప్పారు. ఇక ఢిల్లీలో కోవిడ్ పరీక్షలు పెంచారు.. ఈ రోజు సుమారు 90,000 పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఢిల్లీలో నిన్న 5,481 కరోనావైరస్ కేసులు నమోదుకాగా.. మూడు మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదలను నిరోధించడానికి ఢిల్లీ ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించడంతో పాటు ఆఫీస్‌లకు వర్క్ ఫ్రం హోమ్ విధించింది. ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే పని చేస్తాయని ప్రభుత్వం తెలిపింది.