సిక్కింలో కుండపోత వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు, 100 ఇళ్లు ధ్వంసం
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కింలో కుండపోత వర్షం ఇబ్బంది సృష్టిస్తోంది. సిక్కిం రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి
By అంజి Published on 19 Jun 2023 12:17 PM IST
సిక్కింలో కుండపోత వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు, 100 ఇళ్లు ధ్వంసం
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కింలో కుండపోత వర్షం ఇబ్బంది సృష్టిస్తోంది. సిక్కిం రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం అతలాకుతలం అవుతోంది. సుమారు 3,500 మంది పర్యాటకులు ఉత్తర సిక్కిం జిల్లాలో వరదల్లో చిక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిలో దేశీయ పర్యాటకులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. గత గురువారం నుండి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పెంగాంగ్ సప్లయ్ ఖోలా దగ్గర మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాన్ వెళ్లే రోడ్డు వరదకు కొట్టుకుపోయింది. రోడ్డు కోతకు గురై కొన్ని కొండ చరియలు విరిగిపడ్డాయి.
లెచెన్, లచుంగ్ ప్రాంతాల్లో నేచర్‌ని అస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు.. భారీ వర్షాల వల్ల హోటళ్లలోనే చిక్కుకుపోయారు. దీంతో పర్యాటకులను సేఫ్ ప్లేస్‌లకు తరలించడానికి సిక్కిం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1500 మంది పర్యటకులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షిత తరలించారు. తాజాగా ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 300 మంది పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వారికి భోజన, వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
పశ్చిమ సిక్కిం జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 100 ఇళ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షం కారణంగా కాలేజ్ ఖోలా వ్యాలీ ఎగువ భాగంలో వరదలు సంభవించాయి. అక్కడ ఒక ప్రధాన వంతెన కొట్టుకుపోయిందని వారు తెలిపారు. గ్యాల్‌షింగ్ జిల్లా పరిధిలోని డెంటమ్ సబ్ డివిజన్‌లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయని, ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ భూములు కూడా దెబ్బతిన్నాయి. దిగువ సపుంగ్ వద్ద కాలేజ్ ఖోలాపై ఉన్న సస్పెన్షన్ వంతెన కూడా బురద కారణంగా కొట్టుకుపోయిందని వారు తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం అందించిన అధికారులు, రోడ్లు, వంతెనల పునరుద్ధరణ పనులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇక అస్సాంలో వరద పరిస్థితి దారుణంగా ఉంది12 జిల్లాల్లో వరద ప్రభావిత ప్రజల సంఖ్య దాదాపు 33,500కి తగ్గినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఎడతెగని వర్షం కొత్త ప్రాంతాలను ముంచెత్తడంతో అస్సాంలో వరద పరిస్థితి ఆదివారం భయంకరంగా కొనసాగిందని అధికారిక బులెటిన్ తెలిపింది.