మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోని ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో బుధవారం రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ తూర్పు కమాండ్ తెలిపింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అది తెలిపింది. చందేల్ జిల్లాలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని న్యూ సమతాల్ గ్రామంలో నిఘా వర్గాల సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
ఇదిలా ఉండగా, మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో వచ్చే వారం నుంచి ఐదు రోజుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా కుకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి మైతేయిలు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ఏదైనా ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తర్వాత జరగే పరిణామాలకు వ్యుక్తులే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ మేరకు కుకీ జో విలేజ్ వలంటీర్ ఈస్టర్న్ జోన్ ఓ ప్రకటన జారీ చేసింది. ఉఖ్రుల్లో జరిగే శిరుయ్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మెయితైలు ఎక్కువగా ఉన్న ఇంఫాల్ నుంచి ఉఖ్రుల్‌కు వెళ్లే మార్గంలో- కుకీలు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాల గుండా వెళ్లాలి. కాగా, ఉఖ్రుల్లో నాగా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు.