కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. 10 మంది మృతి, డజన్ల కోద్దీ మందికి గాయాలు
బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. డజన్ల కోద్దీ మంది గాయపడ్డారు.
By అంజి Published on 29 Jan 2025 7:06 AM IST
కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. 10 మంది మృతి, డజన్ల కోద్దీ మందికి గాయాలు
బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. డజన్ల కోద్దీ మంది గాయపడ్డారు. 'రెండో షాహి స్నాన్' రోజు మౌని అమావాస్య సందర్భంగా వేలాది మంది ప్రజలు త్రివేణి సంగమానికి తరలి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. తక్షణ సహాయక చర్యల కోసం పిలుపునిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితి గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి, పరిణామాలను సమీక్షించారని వార్తా సంస్థ ANI నివేదించింది.
చాలా మందికి గాయాలయ్యాయి, చాలా కుటుంబాలు విడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు ఇండియా టుడే టీవీకి చెప్పారు. అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కుంభ్‌లోని సెక్టార్ 2లోని తాత్కాలిక ఆసుపత్రికి తరలించారు. సంగం వద్ద పోల్ నంబర్ 11, 17 మధ్య అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత, అఖారా పరిషత్ (మండలి) నేటి అమృత్ (షాహి) స్నాన్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. సంగమంలో స్నానం చేసిన తర్వాత భక్తులు స్థలం ఖాళీ చేయాలని అధికారులు బహిరంగ ప్రకటన చేశారు.
గాయపడిన వారి సంఖ్య ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఈ సంఘటనలో కనీసం 30 నుండి 40 మంది గాయపడి ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు ఈ వార్తా సంస్థకు తెలిపారు. "మేము రెండు బస్సులలో 60 మంది బ్యాచ్‌లో వచ్చాము. మేము సమూహంలో తొమ్మిది మంది ఉన్నాము. అకస్మాత్తుగా, గుంపులో తోసుకుంటూ, మేము చిక్కుకున్నాము. మేము చాలా మంది పడిపోయాము. జనం అదుపుతప్పి పోయారు" కర్ణాటకకు చెందిన సరోజినిని వార్తా సంస్థ పిటిఐ ఉటంకిస్తూ పేర్కొంది.
బుధవారం మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. గంగానదిలో పుణ్యస్నానం చేసేందుకు భక్తులు అత్యంత పవిత్రమైన రోజుగా మౌని అమావాస్య ప్రసిద్ధి చెందింది. జగత్గురు సాయి మా లక్ష్మీ దేవి పిటిఐతో మాట్లాడుతూ, "మౌని అమావాస్య మాకు సాధువులకు మాత్రమే కాదు, హిందువులందరికీ, వారి ఆత్మ, ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఈ తేదీలో మౌనం పాటించే వారికి ముఖ్యమైనది" అని చెప్పారు.
ఈ ప్రత్యేక రోజుకి ముందు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన క్రౌడ్ కంట్రోల్ చర్యలను విధించింది, ఇందులో వాహనాలు లేని జోన్‌లు, సెక్టార్ వారీ ఆంక్షలు ఉన్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తుల కదలికలు సజావుగా, క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంగం, ఘాట్‌ల నుండి వచ్చిన దృశ్యాలు గంగానదిలో పుణ్యస్నానం చేయడానికి వేలాది మంది భక్తులు గుమిగూడినట్లు చూపిస్తుంది. మౌని అమావాస్య, కొనసాగుతున్న మహాకుంభంతో సమానంగా హిందువులకు ఒక శుభ సందర్భం గా పరిగణించబడుతుంది, ఇది మోక్షం, శాంతిని తెస్తుందని నమ్ముతారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఆచారాలలో భాగంగా భక్తులు మౌనం, ఉపవాసం, పితృ ఆరాధనలో పాల్గొంటారు.