సార్.. రాత్రి మా గ్రామ రహదారి మాయమైపోయింది.. వెతికిపెట్టండి.. పోలీసులకు ఫిర్యాదు
1 Km Stretch Of Road Got 'Stolen' Overnight In MP.సార్.. పొద్దున వరకూ ఉన్న రోడ్డు రాత్రి పూట మాయమైపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 3 July 2021 4:18 PM ISTసార్.. పొద్దున వరకూ ఉన్న రోడ్డు రాత్రి పూట మాయమైపోయింది. దయచేసి వెతికిపెట్టండి సార్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. తొలుత అది విన్న పోలీసులు షాక్‌కు గురైయ్యారు. తాము విన్నది నిజమేనా కాదా అని మరోసారి అడిగారు. సార్ మీరు విన్నది నిజమే సార్.. ఒక కిలోమీటర్ మేర ఉన్న మా ఊరు రహదారి రాత్రికి కనిపించకుండా పోయింది. మీరే ఎలాగైనా వెతికి పెట్టాలంటూ మరోసారి చెప్పారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు.. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అత్యంత వెనకబడిన జిల్లాలో ఒకటైన సిద్ధి జిల్లాలో జరిగింది.
మీకేమైనా మతి పోయిందా..? రోడ్డు కనిపించకుండా ఎలా పోతుంది.. అనేగా మీ డౌట్.. అయితే.. ఇది చదవండి. సిద్ధి జిల్లాలోని మంజోలి జనప్ పంచాయతీ పరిధిలో మేంద్ర అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టరు పనులు చేపట్టాడు. రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అయితే.. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డులో చాలా వరకు కొట్టుకుపోయింది. అంతేకాదు మొత్తం బురద మయం అయిపోయింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
సర్పంచ్ తోపాటు ఉప సర్పంచ్ ఇతర గ్రామస్తులు రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లి ఇదేంటని ప్రశ్నించారు. కానీ.. కాంట్రాక్టర్ సరైన సమాధానం ఇవ్వలేదు. దురుసుగా మాట్లాడడంతో.. వీరంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. స్థానిక మంజోలి స్టేషన్ కు వెళ్లిన గ్రామస్థులు. తమ గ్రామానికి చెందిన రోడ్డు కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. రాత్రి వరకు రోడ్డు బాగానే ఉందని కానీ.. తెల్లవారే సరికి మాయమైపోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడున్న రోడ్డు తమది కాదని అందువల్ల తమ రోడ్డును వెతికి తేవాలని కోరారు.
తొలుత ఇదేం ఫిర్యాదు అని ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఆ తరువాత అధికారులు కాంట్రాక్టర్ల అవినీతి గురించి పై అధికారులకు విన్నవించారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.