నర్సీపట్నం వైద్యుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్
By అంజి Published on 8 April 2020 7:44 AM ISTవిశాఖ: నర్సీపట్నం సీనియర్ వైద్యుడు ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నర్సీపట్నం మొత్తం కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా.. ఆశ్చర్యపోనవసరం లేదు.. పేరుకే 150 పడకల ఆస్పత్రి, కనీస సౌకర్యాలు కరువు అయ్యాయంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లకే ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారని.. దానికి మళ్లీ సంతకం కూడా తీసుకుంటున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఆస్పత్రిని విజిట్ చేయరు అంటూ మండిపడ్డారు. ఆస్పత్రి పరిస్థితులపై జిల్లా కో-ఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గైనకాలిజిస్ట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం.. అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి చూడాలన్నారు. కరోనా విజృంభనపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తానంటూ డా.సుధాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అతడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. అసలు నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి డాక్టరేనా.. లేకా రాజకీయ నాయకుడా అంటూ ఫైర్ అయ్యారు. సీఎంను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్‌కి ఎంత బలుపు అంటూ వ్యాఖ్యనించారు. డాక్టర్ పనిచేస్తున్న ఆస్పత్రిలోనే 20 పీపీఈలు ఉన్నాయన్నారు. అసలు అది కరోనా ఆస్పత్రి కానే కాదన్నారు. ఆస్పత్రిలో ఏప్రిల్ 3 నాటికి పీపీఈలు 20, ఎన్–95 మాస్కులు 32, హెచ్‌ఐవీ మాస్కులు 35 అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇవ్వాల్సిన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లను వైసీపీ నాయకులు కొట్టేయడం దారుణమని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ పబ్లిసిటీకి, క్షేత్ర స్థాయిలోని కరోనా నివారణ చర్యలకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందని ఆయన విమర్శించారు.