బిగ్‌బాస్ షో పై ఫైర్ అయిన సీపీఐ నారాయ‌ణ‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 1:37 PM GMT
బిగ్‌బాస్ షో పై ఫైర్ అయిన సీపీఐ నారాయ‌ణ‌

తెలుగులో బిగ్ బాస్ సీజన్-4 ఆరంభమైంది. ఈ షోను గతంలోనే అడ్డుకోవాలని చాలా మంది రాజకీయనాయకులు, కొన్ని సంఘాలు ప్రయత్నించాయి. కానీ గత సీజన్ లను అడ్డుకోలేకపోయాయి. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్ బాస్ షో పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది మన సంస్కృతి కాదని.. ఇది కళామతల్లికి చేసే తీవ్ర అన్యాయం అంటూ నిరసన వ్యక్తం చేశారు.

అంగరంగ వైభవంగా బిగ్ బాస్ షో ను మొదలుపెట్టారని.. హిమాలయాలలో ఉన్న వారిని తీసుకుని వచ్చి మురికి కుంటలో పడేసినట్లు ఈ షో ఉందని అన్నారు నారాయణ. విజయ మాల్యా ఎటువంటి విలాసవంతమైన జీవితం గడిపాడో అలాంటి విలాసవంతమైన జీవితం గడిపేలా బిగ్ బాస్ హౌస్ ను రూపొందించారని ఆయన ఆరోపించారు.

యువతీ యువకులను పిలిపించి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్నలను కూడా నారాయణ తప్పుబట్టారు. ఎవరి ముద్దు పెట్టుకుంటావు.. లాంటి ప్రశ్నలు అడగడం ఎంతవరకూ సమంజసం అని నారాయణ ప్రశ్నించారు. కంటెస్టెంట్ ఒకమ్మాయిని ముద్దు పెట్టుకుంటా.. ఇంకో అమ్మాయిని డేటింగ్ చేస్తా.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అంటే నాగార్జున నవ్వుతూ కనిపించారని.. ఇదా యువతీ యువకులకు ఇచ్చే సందేశం అని నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అనైతికంగా దిగజారే పద్దతులను పాటిస్తూ ఉన్నారని నారాయణ అభిప్రయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా సమాజానికి మంచి చేసే పనులు చేయాలి కానీ.. కళామతల్లికి ప్రమాదాన్ని తీసుకుని వచ్చే పద్దతులను తీసుకుని వస్తున్నారని అన్నారు. కోట్లాది మందిని టీవీల ముందు కూర్చోపెట్టి.. సాంస్కృతిక దోపిడీకి ఇలాంటి షోలు పాల్పడుతున్నాయని వీటిని ఖండిస్తూ ఉన్నామని అన్నారు నారాయణ.

Next Story
Share it