కరోనా పోవాలని.. ఆలయంలో అమ్మవారికి నరబలి ఇచ్చిన పూజారి

By సుభాష్  Published on  28 May 2020 12:51 PM GMT
కరోనా పోవాలని.. ఆలయంలో అమ్మవారికి నరబలి ఇచ్చిన పూజారి

ప్రపంచం ఒక వైపు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ.. ఇంకా అత్యున్నతమైన టెక్నాలజీని సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంటే దానికి వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు పరిశోధకులు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉన్న ప్రస్తుతం కాలంలో మూఢనమ్మకాలను నమ్మూతు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. కరోనా తరిమికొట్టాలంటూ ఓ పూజారి ఏకంగా నరబలి ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆలయంలో ఓ వ్యక్తి తల నరికి అమ్మవారికి బలిచ్చాడు. ఒడిశాలోని కటక్‌ జిల్లా నర్సింగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బందాహుడా గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

సన్సారి ఓజా (75) అనే వ్యక్తి 'బంద మా బుద్ద బ్రాహ్మణిదేవి' ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో నేపథ్యంలో ఈ పూజారికి బ్రాహ్మణిదేవత కలలోకి వచ్చి కరోనాకు పరిష్కారం చెప్పిందట. దీంతో ఆలయంలో నరబలి ఇచ్చేందుకు సరోజా్‌ కుమార్‌ ప్రదాన్‌ అనే వ్యక్తిని ఎంచుకున్నాడు ఆ పూజారి. ఇంకేముంది అతనికి లేనిపోని మాయ మాటలు చెప్పి ఆలయంలో నరబలి ఇచ్చేందుకు బుధవారం రాత్రి సమయంలో ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. ఇక నరబలి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పూజారి గొడ్డలి తీసి సరోజ్‌ (53) తలపై నరికాడు. వెంటనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే హత్య చేసిన సమయంలో మత్తులో ఉన్న పూజారి సరోజ్‌ కుమార్‌ను హత్య చేసిన సమయంలో పూజారి మద్యం తాగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

కాగా, మృతుడు సరోజ్‌ కుమార్, పూజారి సన్నారి ఓజాకు పాత కక్షలున్నాయని, ఓ మామిడి తోట విషయంలో ఇరువురి మధ్య ఎన్నోమార్లు గొడవలు జరిగినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. నరబలి ఇవ్వడం వల్లే కరోనా పోతుందని బ్రాహ్మణి దేవి కలలో వచ్చి చెప్పడం వల్లే హత్య చేశానని పూజారి పోలీసుల ముందు చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ రోజుల్లో ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి హత్య చేసిన పూజారికి కఠినమైన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story