మొక్కే కదా అని పీకాలనుకున్నావో... పీక కోస్తా!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Nov 2019 1:04 PM ISTముఖ్యాంశాలు
- చెట్ల నరికివేతపై హైదరాబాదీల ఆగ్రహం
- చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నల్లగండ్ల వాసులు
- చెట్ల నరికివేతపై ఉద్యమించాలని నల్లగండ్ల వాసుల పిలుపు
హైదరాబాద్ :“మొక్కే కదా అని పీకాలనుకున్నావో ... పీక కోస్తా” అన్న చిరు పంచ్ డైలాగ్ నే ఇప్పుడు నల్లగండ్ల నివాసులు నినదిస్తున్నారు. చెట్ల మీద చెయ్యేస్తే ఖబర్దార్ అంటున్నారు. నల్లగండ్ల –తల్లాపూర్ రోడ్ లో దాదాపు 130 చెట్లను కూల్చేసిన కాంట్రాక్టర్, రోడ్ల భవనాల అధికారులపై ఇప్పుడు వాళ్లు భగ్గుమంటున్నారు. ఇరపై ముఫ్ఫై ఏళ్లు ఏపుగా పెరిగిన చెట్లను గొడ్డలివేటుకు కూల్చడాన్ని వాళ్లు సవాలు చేస్తున్నారు. దాదాపు 500 మంది స్థానికులు చెట్ల కూల్చివేతకు వ్యతిరేకంగా పర్యావరణ రణ శంఖాన్ని పూరించారు. మానవ హారం గా నిలిచి చెట్లతో తమకున్న చెలిమిని ప్రదర్శిస్తున్నారు.
రోడ్డెక్కిన చిన్నారులు
ఈ వృక్ష మిత్రుల్లో చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎండను పట్టించుకోకుండా వాళ్లు రోడ్లెక్కారు. ప్లకార్డులను పట్టుకుని గొంతెత్తారు. నిజానికి రోడ్లు వెడల్పు చేసే పని పేరిట ఆర్ అండ్ బీ సూపర్ వైజర్ ఆధ్వర్యంలో నవంబర్ 8 న చెట్లను కొట్టేశారు. చెట్లు కొట్టేసే ముందు తమను సంప్రదించాలని ట్రీ ప్రొటెక్షన్ కమిటీ వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పర్యావరణాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల సేవ్ నల్లగండ్ల ట్రీస్ సంస్థ కు చెందిన భారతి దంతులూరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో తమతో చేతులు కలపాలని ప్రజలను, పర్యావరణ వాదులను, వృక్ష ప్రియులను ఎస్ ఎన్ టీ కార్యకర్త కాజల్ మహేశ్వరి కోరారు.
చెట్లు నరికితే నష్టం..కష్టం
అసలు అభివృద్ధి ఎంత అవసరమో పర్యావర,ణ పరిరక్షణా అంతే అవసరం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ మా పర్యవేక్షణతో, మా భాగస్వామ్యం తోటే జరుగుతున్నాయి. అలాంటిది చెట్లు నరికి వేసే ముందు మమ్మల్ని సంప్రదించి ఉంటే మేమ చెట్లకు నష్టం జరగకుండా చూస్తూనే అభివృద్ధి సాదించే వారం అన్నారు. అసలు కాంట్రాక్టర్లు కూలీలకు తగినన్ని శౌచాలయాలను నిర్మించాలని, వ్యర్థాల నియంత్రణ, నిర్వహణలపై వారు దృష్టిపెట్టాలని సేవ్ నల్లగండ్ల ఉద్యమకారులు కోరుతున్నారు.