మొన్న జబర్దస్త్.. నిన్న అదిరింది.. ఇప్పుడేమో ఇది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2020 6:24 AM GMT
మొన్న జబర్దస్త్.. నిన్న అదిరింది.. ఇప్పుడేమో ఇది

మెగా బ్రదర్ నాగబాబు.. సినిమాలు, సీరియళ్లను మించి పాపులారిటీ తెచ్చుకున్నది ‘జబర్దస్త్’ కామెడీ షోతోనే. ఆయన ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో ఉండగా ‘జబర్దస్త్’ షోనే ఆయన్ని ఆదుకుంది. ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు మానసికంగా కూడా తాను హుషారుగా తయారు కావడానికి ఈ షో కారణమైందని నాగబాబు ఓ సందర్భంలో చెప్పుకున్నారు. ఐతే అనివార్య కారణాల వల్ల కొన్ని నెలల కిందట ఆయన ఈ షో నుంచి తప్పుకున్నారు.

తర్వాత జీ తెలుగు ఛానెల్లో ‘అదిరింది’ పేరుతో కొత్త కామెడీ షోను అన్నీ తానై నడిపించారు. దీని కోసం కొందరు జబర్దస్త్ టీం లీడర్లను కూడా ఆయన రప్పించగలిగారు. ఐతే ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ షోను విజయవంతం చేయలేకపోయారు నాగబాబు. అసలే అంతంత మాత్రంగా షో నడుస్తుండగా.. లాక్ డౌన్ వచ్చి దానికి పూర్తిగా బ్రేక్ వేసేసింది.

ఇప్పుడు షూటింగ్స్ పున:ప్రారంభం అయినా కూడా ఆ షో మళ్లీ నడుస్తుందో లేదో సందేహంగా ఉంది. ఈ సందేహాల్ని మరింత పెంచుతూ నాగబాబు ఒక ఆసక్తికర అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘అల్టిమేట్ కామెడీ షో’ పేరుతో ఆయన సొంతంగా ఒక కామెడీ షోకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఏ టీవీ ఛానెల్లోనూ ప్రసారం కాబోదు. నాగబాబు సొంతంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానెల్ ‘నా ఇష్టం’ కోసం మొదలుపెడుతున్న షో ఇది.

ఈ షోలో ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. సెలక్షన్స్ కోసం అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆడిషన్స్ చేసి ఎంపికైన వాళ్లతో ‘జబర్దస్త్’ తరహాలోనే కామెడీ షో నడిపించేలా ఉన్నారు నాగబాబు. ఇందుకోసం కొంత పెట్టుబడి, ఒక టీంను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే మరో ఛానెల్ అండతో మొదలుపెట్టిన కామెడీ షోతో దెబ్బ తిన్న నాగబాబు.. సొంతంగా నడిపించబోయే ఈ కామెడీ షోను ఏ మేరకు సక్సెస్ చేస్తారో చూడాలి.

Next Story