మ‌హిళా దినోత్స‌వాన్ని ఎందుకు జ‌రుపుకొంటారో తెలుసా..?

Womens Day 2021. ప్రతియేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము.

By Medi Samrat  Published on  7 March 2021 1:51 PM GMT
womens day special
ప్రతియేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము. దీని గురించి ఇప్పటికే మీ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు మెసేజ్‌లు కూడా వచ్చి ఉంటాయి. ఇంతకీ ఇది ఎప్పుడు? దేని కోసం? దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 110వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అయితే, 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. ఈ ఏడాది 'సమానత్వంతో ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి' అన్నది ఈ ఏడాది నినాదం. పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న రాజకీయ మూలం.

మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకోవాలి?

1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు 'ఆహారం - శాంతి' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉందా?

నిజం చెప్పాలంటే.. ఉంది. అది నవంబర్ 19వ తేదీన. 1990వ సంవత్సరం నుంచే దీనిని పాటిస్తున్నారు. కానీ, దీనికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు. 60కి పైగా దేశాల్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 'పురుషులు, బాలుర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, లింగ సంబంధాలను మెరుగుపర్చడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, సానుకూల పురుష స్ఫూర్తి ప్రదాతలను ప్రచారం చేయడం' ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉద్దేశ్యాలు. భారతదేశంలో 2007వ సంవత్సరం నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుతున్నాయి.
Next Story