టమోటో ఫ్లూ టెన్షన్..!

What is Tomato Flu and should you be worried. శరీరమంతటా.. ఎర్రగా, నొప్పితో కూడిన పొక్కులు ఏకంగా టమాటా పరిమాణంలో

By Medi Samrat  Published on  27 Aug 2022 1:50 PM GMT
టమోటో ఫ్లూ టెన్షన్..!

శరీరమంతటా.. ఎర్రగా, నొప్పితో కూడిన పొక్కులు ఏకంగా టమాటా పరిమాణంలో పెరగడాన్ని 'టమోటో ఫ్లూ' అంటారు. భారతదేశంలో 82 మంది పిల్లలు ప్రస్తుతం టమోటో ఫ్లూతో బాధపడుతూ ఉన్నారు. ఎక్కువగా కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారు టమోటా ఫ్లూతో బాధపడుతున్నారు.

టమోటో ఫ్లూ వైరస్ ఉనికిని నిర్ధారించడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. బొబ్బలు, దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి.. అవి పెద్ద పరిమాణంలో పెరుగుతాయి. ఈ దద్దుర్లు చర్మంపై చికాకుకు కూడా దారితీస్తాయి.

మంకీపాక్స్, చికున్ గున్యా, డెంగ్యూ.. వంటి ఇతర వ్యాధులలో కూడా దద్దుర్లు, పొక్కులు కనిపిస్తాయి. కానీ టమోటో ఫ్లూ యొక్క ఇతర లక్షణాలు.. జ్వరం, అలసట, వికారం, వాంతులు, అతిసారం, నిర్జలీకరణం, కీళ్ల వాపు, శరీర నొప్పులు, సాధారణ ఇన్ఫ్లుఎంజాతో వచ్చే లక్షణాలు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.నరసింగా రెడ్డి మాట్లాడుతూ.. "వివిధ రకాల వైరస్‌ల వల్ల బొబ్బలు వచ్చే అవకాశం ఉంది. ఈ లక్షణాలున్న పిల్లల్లో డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్, వరిసెల్లా-జోస్టర్ వైరస్, హెర్పెస్ నిర్ధారణకు మాలిక్యులర్, సెరోలాజికల్ పరీక్షలు చేస్తారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు మినహాయించబడిన తర్వాత, టొమాటో వైరస్ నిర్ధారించబడింది. ఎందుకంటే టొమాటో ఫ్లూ చికున్‌గున్యా, డెంగ్యూతో పాటు ఇతర వ్యాధులను పోలి ఉంటుంది. చికిత్సా విధానం కూడా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగే ఉంటుంది."

జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్. జె. అనీష్ ఆనంద్ వివరిస్తూ, "ఇది ప్రమాదకరమైనది కాదు. కోవిడ్-19 వలె వేగంగా వ్యాపించదు. ప్రాణాపాయం కూడా లేదు. ఇది కొన్ని రోజులలో నయమవుతుంది. పరిశుభ్రత పాటిస్తూ.. పిల్లలను వేరుచేసి జాగ్రత్తలు తీసుకోవాలి." అని తెలిపారు. పెద్దల కంటే చిన్న పిల్లలే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కు గురవుతూ ఉంటారు.

రెనోవా హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రావణి రెడ్డి కారుమూరు మాట్లాడుతూ, "టమోటో ఫ్లూ అనే పేరు భారతదేశంలో మాత్రమే వాడుకలో ఉంది. అంతర్జాతీయ లేదా జాతీయ వైద్య పత్రికలు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వంటివి ఏ ఫ్లూ పేరును కూడా టమోటో ఫ్లూ అని పిలవలేదు"

పెద్దవారిలో ఈ వ్యాధి చాలా అరుదని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వైరస్ నుండి రక్షించడానికి తగినంత బలమైన రోగనిరోధక వ్యవస్థలను పెద్దలు కలిగి ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ఫ్లూ కారణంగా జ్వరం, నోటిలో నొప్పితో కూడిన పుండ్లు, చేతులు, పాదాలు ఇతర ప్రాంతాల్లో దద్దుర్లు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ ఫ్లూ సోకిన పిల్లలలో దద్దుర్లు, చర్మం మీద మంట మాత్రమే కాకుండా డీహైడ్రేషన్ కు గురవుతారు. దీని వల్ల శరీరంలోని అనేక భాగాలపై బొబ్బలు ఏర్పడతాయి. ఈ బొబ్బలు ఎరుపు రంగులో ఉండడంతో దీనిని "టమోటో ఫ్లూ" లేదా "టమోటా జ్వరం" అంటారు.

టొమాటో ఫ్లూ నివారణ చర్యలపై వైద్యులు పలు సూచనలు చేశారు. బొబ్బలను తాకడం, గోక్కోవడం వంటివి అసలు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. కాచిన నీటిని తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండాలని.. సరైన పరిశుభ్రత పాటించాలని సూచించారు. స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. రోగికి వీలైనంతగా విశ్రాంతి ఇవ్వాలి.


Next Story