విగ్రహాలా? సాంఘిక సంక్షేమమా?

వివిధ వర్గాల నుంచి వచ్చే విగ్రహ నిర్మాణాల ఏర్పాటుకు ప్రభుత్వాలకు కూడా ఒక వర్గం డిమాండ్ ని అంగీకరించి మరొక వర్గం డిమాండ్ ని కాదనే పరిస్దితులు లేవు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Aug 2023 4:04 AM GMT
Statues, Social Welfare, Ambedkar statue, Telangana, Andhrapradesh

విగ్రహాలా? సాంఘిక సంక్షేమమా? 

కొన్ని దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రాజకీయ పార్టీలు, రాష్ట్ర రాజకీయ పార్టీలు ప్రజల అభీష్టం మేరకు, వివిధ కుల సంఘాలు, సంస్థల నుంచి వచ్చే డిమాండ్స్ , వినతులను బట్టి ఆయా కులాలకు, రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించి సమాజములో పేరు పొందిన నాయకులు, స్వాతంత్రోద్యమ మహనీయులు, వివిధ రంగాలలో సమాజ అభ్యున్నతికి పాటుపడిన వారి సేవలు భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి అని వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం మనము చూస్తున్నాము.

ఇలా విగ్రహల నిర్మాణం కొరకు డిమాండ్ చేసే కొన్ని వర్గాల వారు ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన తమ నాయకులు విగ్రహ నిర్మాణం చేస్తేనే వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినవారు అవుతారు అని ప్రభుత్వాల ముందు పెట్టె డిమాండ్స్ కి ప్రభుత్వాలు కూడా వారి డిమాండ్స్ కి కాదనే పరిస్దితి నెలకొంది. వివిధ వర్గాల నుంచి వచ్చే విగ్రహ నిర్మాణాల ఏర్పాటుకు ప్రభుత్వాలకు కూడా ఒక వర్గం డిమాండ్ ని అంగీకరించి మరొక వర్గం డిమాండ్ ని కాదనే పరిస్దితులు లేవు.

మరికొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీ లు కొన్ని వర్గాల ఓట్లు ఆకర్షించడానికి ఆయా వర్గాల నుంచి ఎటువంటి డిమాండ్స్ , వినతులు రానప్పటికీ ఆయా వర్గాలుకు ప్రాతినిధ్యం వహించి పేరు పొందిన నాయకుల విగ్రహాలు ఏర్పాటుకు చొరవ తీసుకోవడం మనం చూస్తున్నాము. ప్రభుత్వాలు కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వెచ్చిస్తున్న ప్రజాధనాన్ని విగ్రహ నిర్మాణాలకంటే ఆయా వర్గాల విద్య, వైద్య, ఉపాధి సంక్షేమానికి వినియోగించి వారి అభ్యున్నతికి పాటుపడేలా వారికి నచ్చచెప్పి, వారిని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు.

తెలుగు రాష్ట్రాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తుతో నిర్మించతలపెట్టిన విగ్రహాల గురించి, ఆంధ్ర ప్రదేశ్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ విగ్రహ నిర్మాణానికి సంబందించిన మరిన్ని విషయాలను, నిర్మాణంలో జాప్యం వలన విగ్రహ ఖర్చు ఎలా అంచనాలకు మించి దాటిపోయింది. నూతనంగా విగ్రహాల ఏర్పాటు కోసం వస్తున్న డిమాండ్స్ ను ఈ న్యూస్ ఆర్టికల్ లో చర్చిద్దాం.

2016 వ సంవత్సరములో 125 సంవత్సరాల అంబేడ్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ తెలంగాణాలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యములో, ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యములో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ కడుతున్న కాంట్రాక్టర్ ఒక్కరే. కేపీసీ ప్రాజెక్ట్స్ అనే నిర్మాణ సంస్ద ఈ ప్రాజెక్ట్స్ ని చేపట్టినట్లు వారి వెబ్సైటులో ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలని పొందుపరచడం జరిగింది.

కేపీసీ ప్రాజెక్ట్స్ వారు విగ్రహ నిర్మాణానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ ని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల వద్ద నుండి తీసుకున్నపుడు విగ్రహ నిర్మాణానికి అయ్యే ఖర్చు యొక్క అంచనాలను వారి వెబ్సైటులో పొందుపర్చడం జరిగింది. తెలంగాణ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహా నిర్మాణ ప్రాజెక్ట్ కి 100.23 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్ట్ కి పనులని రూ.180.00 కోట్ల అంచన అని వారి వెబ్సైటు లో పొందుపరిచారు.

విగ్రహ నిర్మాణానికి సంబందించిన ప్రాజెక్ట్ చేస్తున్న కాంట్రాక్టర్ (KPC Projects), డిజైన్ కన్సల్టెంట్ (Design associates Noida ) విగ్రహ రూపశిల్పి (Ram V Sutar), హర్యానా, మానెసర్ లో విగ్రహాన్ని పోతపోసి విగ్రహ భాగాలను రూపొందిస్తున్న ఫౌండ్రి ఒక్కటే.

తెలంగాణ లో విగ్రహ నిర్మాణ (విగ్రహం ఎత్తు 125 అడుగులు + విగ్రహ పీఠం 50 అడుగులు) ఖర్చు 146.50 కోట్ల రూపాయలలో పూర్తి అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని విగ్రహ నిర్మాణ (విగ్రహం ఎత్తు 125 అడుగులు + విగ్రహ పీఠం 81 అడుగులు) ఖర్చు అంచనాలకు మించి సవరించిన అంచనాలు, అందుబాటులో వున్న సమాచారం ప్రకారం విగ్రహ నిర్మాణ ఖర్చు 268.46 కోట్లు దాటిపోయింది అని తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏప్రిల్ 14 వ తేదీ 2016 వ సంవత్సరములో హైదరాబాద్ ఎన్టీఆర్‌ గార్డెన్స్ ట్యాంకుబండ్ ప్రాంతంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్ధాపన, భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయ్యింది అని ఈ సందర్భముగా ఆ మహనీయుడికి రుణపడి వున్నాము అని చెప్పడం జరిగింది.

విగ్రహ నిర్మాణ పనులకు 2017 వ సంవత్సరములో టెండర్లు పిలవడం జరిగింది, ఆ తదుపరి విగ్రహ ఏర్పాటుకు సంబందించిన స్దలం విషయములో ఏర్పడిన అవాంతరాలు, కోవిడ్‌ -19 సమయములో జాప్యం జరిగినప్పటికీ విగ్రహాన్ని నిర్మించడానికి జూన్ 3 2021 న ఒప్పందం చేసుకోవడం జరిగింది. విగ్రహ నిర్మాణానికి సంబందించిన పనులు అన్ని పూర్తిచేసుకుని ఏప్రిల్ 14 వ తేదీ 2023 వ సంవత్సరములో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించడం జరిగింది.

తెలంగాణ విగ్రహ నిర్మాణానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన G.O.RT.No. 211 - 11/04/2016, G.O.RT.No. 291 - 21/05/2016 వివరాలు తప్ప నిర్మాణనికి సంబంధించి ఎటువంటి G.O.లు అందుబాటులో లేవు. వార్త పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియా లో అందుబాటులో వున్న సమాచారం ప్రకారం విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు 146.50 కోట్ల రూపాయలు. విగ్రహ నిర్మాణానికి అవసరమైన నిధులును తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SCSDF) ద్వారా కేటాయిస్తున్నట్లు అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా తెలుస్తుంది.

మార్చి 30 వ తేదీ 2016 వ సంవత్సరములో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు.. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భముగా 125 సంవత్సరాల అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ సంవత్సరం అంతా జయంతి ఉత్సవాలను వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని, అమరావతిలో 15 ఎకరాల విస్తీర్ణములో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా ఏప్రిల్ నెల 6 వ తేదీ 2016 వ సంవత్సరములో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భముగా అమరావతిలో బాబూ జగ్జీవన్‌రామ్ స్మారక చిహ్నాన్ని, భవనాన్ని నిర్మిస్తాము అని చంద్రబాబు ఆ కార్యక్రమములో ప్రకటించడం జరిగింది.

ఏప్రిల్ 14 వ తేదీ 2017 వ సంవత్సరములో చంద్రబాబు ఐనవోలు గ్రామము, తుళ్లూరు మండలం, అమరావతి లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్ధాపన , భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. విగ్రహానికి బడ్జెట్ కేటాయించడం అయితే జరిగింది కానీ నిర్మాణ పనులు అనుకున్నంత వేగముగా ముందుకు వెళ్ళలేదు.

25-01-2017 న ఇచ్చిన G.O.Rt.No.28 ద్వారా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహా నిర్మాణ ప్రాజెక్ట్ కి 97.69 కోట్ల రూపాయలు బడ్జెట్ ని కేటాయించడం జరిగింది.

10-04-2018 న ఇచ్చిన G.O.RT.No. 132 ద్వారా అంబేడ్కర్ విగ్రహా నిర్మాణ ప్రాజెక్ట్ కి సంబందించిన కమిటీ ల విషయమై GO ఇవ్వడం జరిగింది

2019 వ సంవత్సరములో ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్సీపీ పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత, గత టీడీపీ ప్రభుత్వములో అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించ తలపెట్టిన నిర్ణయాన్ని పక్కన పెట్టి, విజయవాడ స్వరాజ్ మైదానము లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలని వై. ఎస్. జగన్ నిర్ణయం తీసుకున్నారు. జులై 8 వ తేదీ 2020 వ సంవత్సరములో విగ్రహ నిర్మాణానికి శంకుస్ధాపన చేయడం జరిగింది.

7.07.2020 న ఇచ్చిన G.O.Rt.No.244 ద్వారా విజయవాడ స్వరాజ్ మైదాన్ ప్రదేశాన్ని అంబెడ్కర్ విగ్రహ నిర్మాణానికి కేటాయిస్తూ ఆ ప్రదేశాన్ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి బదలాయిస్తూ విగ్రహ నిర్మాణ ఖర్చు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ “4225 - 01- MH – 800 – GH - 11 - SH(06) అకౌంట్ నుండి జరుగుతుంది అని GO ఇవ్వడం జరిగింది

12-08-2020 న ఇచ్చిన G.O.RT.No. 296 ద్వారా స్వరాజ్ మైదానములో నిర్మించ తలపెట్టిన అంబేడ్కర్ విగ్రహా నిర్మాణ ప్రాజెక్ట్ కి సంబందించిన కమిటీల విషయమై GO ఇవ్వడం జరిగింది

08-03-2021 న ఇచ్చిన G.O.RT.No. 43 ద్వారా విగ్రహ నిర్మాణానికి సవరించిన అంచనాలతో 268.46 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది

విగ్రహ నిర్మాణానికి సంబంధించి 2018-2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2023-2024 SCP - షెడ్యూల్డ్ కాస్ట్ కంపోనెంట్ (SC సబ్ ప్లాన్) నిధులను వినియోగిస్తున్నారు.

Covid -19 సమయములో పనుల వేగములో జాప్యం ఇతరత్రా కారణాల వలన విగ్రహ నిర్మాణం అనుకున్న సమయానికి 2023 ఏప్రిల్ నెల 14 వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించలేకపోవడం జరిగింది.

సెప్టెంబర్ 13, 2022 న ఒకసారి, ఫిబ్రవరి 15, 2023 న మరొకసారి ఏపీ మంత్రుల బృందం స్వయంగా, హర్యానా, మానెసర్ లో విగ్రహ భాగాలు రూపొందిస్తున్న ఫౌండ్రి ని దర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించడం జరిగింది. ప్రస్తుతం విగ్రహ నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యి ఆవిష్కరించడానికి సిద్ధంగా వున్నది.


అంబేడ్కర్ స్వరాజ్ మైదానము స్మృతివనంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా మరికొన్ని భవనాలను నిర్మించాలని, స్మృతివనం ప్రాంగణాన్ని అత్యాధునిక పద్ధతుల్లో సుందరీకరించాలని నిర్ణయించడంతో అదనంగా మరో రూ.106 కోట్లను మంజూరు చేశామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున గారు వెల్లడించారు.


125 అడుగుల అంబేడ్కర్ విగ్రహా నిర్మాణం 2017 వ సంవత్సరములో 97.69 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమయ్యి 2021 వ సంవత్సరములో 268.46 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 380 కోట్లకు చేరింది. విగ్రహ నిర్మాణం పూర్తి అయితే కానీ మొత్తం యెంత ఖర్చు అయ్యిందో తెలవదు.

ఇది ఇలా ఉండగా స్వాతంత్ర్య సమర యోధుడు, తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితములో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన భారత ఉప ప్రధానిగా సేవలు అందించిన బాబు జగ్జీవన్‌రామ్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ లో 125 అడుగుల Dr . బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం పక్కనే అంతే ఎత్తులో నిర్మించాలి అని విజయవాడలో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశములో AP MRPS డిమాండ్ చేయడం జరిగింది.

జగజ్జీవన్‌ రాం, అంబేడ్కర్‌ అంటే మా దళిత, గిరిజన జాతులకు రెండు కళ్లుగా భావిస్తున్నాం. ఈ రెండు కళ్లు , రెండు విగ్రహాలు ఒక చోట పెట్టాల్సిన అవసరం ఉంది అని ఈ సమావేశంలో వారు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది.

దళిత సమాజ సాంఘిక, సామజిక అభివృద్ధిని విస్మరించి వారి అభ్యున్నతికి ఖర్చు చేయవలసిన ఎస్సీ సబ్‌ ప్లాన్ నిధులు ఇలా విగ్రహాలు నిర్మించుకుంటూ పొతే అది దళితుల అభ్యున్నతికి వారి ఆత్మ గౌరవాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది అని నేను ఈ సందర్భముగా ఆ డిమాండ్ చేస్తున్న వారిని, ఆయా సంస్ధలను అడుగుతున్నాను. 125 అడుగుల బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అంటే SC సబ్ ప్లాన్ నిధుల నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు రూపాయలు ఖర్చు చేయవలసిన పరిస్దితి వుంది.

ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ టెక్నాలజీ, Internet of things (IOT) ,రోబోటిక్స్ సాంకేతికత వలన కొన్ని వేల ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి మరియు నూతన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్దితులులలో కమ్యూనిటీ లో BTech, MTech చదివిన విద్యార్థులకు ప్రభుత్వం తరుపున ఆయా పరిశ్రమల సహకారంతో వారికి తగిన నైపుణ్యాలు అందించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కోడింగ్ స్కిల్స్ నేర్పించేలా ప్రభుత్వాలని ఎలా ఒప్పించాలి అని ఆలోచించడం మానేసి విగ్రహాల కోసం పోటీ ఏమిటీ అని కొంచం ఆలోచించండి.

ఐ.టి.ఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు చదివి, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకుండా , చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోలేక, ఉపాధి అవకాశాలు లేకుండా ఉండి భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా వున్న కమ్యూనిటీ లో వున్న మన బిడ్డలకి ఈ విగ్రహాల వలన ఎటువంటి ప్రయోజనం కలిగిస్తుందో కొంచం వివరించండి. విగ్రహానికి ఖర్చు పెట్టె ఆ మొత్తం తో ఎంతమంది వ్యవసాయ భూమి లేని అర్హులైన దళితులకు వ్యవసాయ భూమి ఇవ్వవచ్చో ఆలోచించండి.

విగ్రహ నిర్మాణానికి అయ్యే బడ్జెట్ తో ప్రతి జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలలు హాస్పిటల్స్ కట్టించవచ్చో దాని గురించి ఆలోచించండి. ఈ సందర్భముగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నాయకులకు, రాజకీయ పార్టీలకు విన్నవించుకునేది ఏమనగా, దయచేసి వివిధ రాజకీయ, సామజిక కారణాలతో మీరు ఒకవేళ 125 అడుగుల బాబు జగ్జీవన్‌రామ్ లేదా ఇతర ప్రముఖ నాయకుల విగ్రహాలను నిర్మించాలి అని ఒకవేళ నిర్ణయం తీసుకునే పరిస్దితులు ఉంటే దయచేసి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వెచ్చిస్తున్న ప్రజాధనాన్ని విగ్రహనిర్మాణాలకంటే ఆయా వర్గాల విద్య, వైద్య, ఉపాధి సంక్షేమానికి వినియోగించి వారి అభ్యున్నతికి పాటుపడేలా వారికి నచ్చచెప్పి, వారిని ఒప్పించడానికి ప్రయత్నించండి.

విగ్రహ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ప్రతి జిల్లాలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలలను, హాస్పిటల్స్ ను నిర్మించి వాటికి బాబు జగ్జీవన్‌రామ్ గారి పేరు లేదా ఇతర ప్రముఖ నాయకుల పేరు పెట్టండి, తద్వారా వారి ఆశయ సాధనకు. సమాజ శ్రేయస్సుకు మీరు కృషి చేసిన వారు అవుతారు.

క్రెడిట్: ప్రదీప్ కుమార్ గోళ్లమూడి

Next Story