కుక్కను పెంచుకుంటున్నారా..? లైసెన్స్ అవసరం తెలుసా..?
Pet Dog License is important. గత నెలలో పెంపుడు కుక్కలు సాధారణ ప్రజలను కొరికిన సంఘటనల వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 14 Sep 2022 1:39 PM GMTహైదరాబాద్ : గత నెలలో పెంపుడు కుక్కలు సాధారణ ప్రజలను కొరికిన సంఘటనల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా పలు హౌసింగ్ సొసైటీలలో ఆందోళనకు గురయ్యాయి. పెంపుడు కుక్కలను సొంతం చేసుకునేందుకు సంబంధించిన నియమాలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకు ముందు కుక్క కాటుకు గురైన సంఘటనలు నమోదవగా, ఇప్పుడు వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నామని సిటిజన్స్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకుడు పృధ్వి చెప్పారు.
"చాలా కుక్కలు వీలైనంత తొందరగా కొరకాలని అనుకోవు. ఎవరైనా రెచ్చగొడితేనే కుక్కలు కొరకడానికి ముందుకు వెళతాయి. కుక్క కాటుకు గురైతే, కాటుకు గురైన వ్యక్తి వైద్య ఖర్చులను యజమాని సాధారణంగా చూసుకుంటాడు. హౌసింగ్ సొసైటీలు, ప్రజలు సాధారణంగా పెంపుడు తల్లిదండ్రులకు మరింత మద్దతుగా ఉండాలి, "అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(g) చట్టబద్ధంగా కుక్కలను కలిగి ఉండటానికి ప్రజలను అనుమతిస్తుంది, పెంపుడు కుక్కలను తప్పనిసరిగా స్థానిక మునిసిపాలిటీలో నమోదు చేయాలి. సకాలంలో టీకాలు వేయించడానికి యజమానులు బాధ్యత తీసుకోవాలి.
హైదరాబాద్‌లో పెంపుడు జంతువుల యజమానులు GHMC జారీ చేసిన పెట్ డాగ్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది. గతంలో స్థానిక మండల కార్యాలయాల్లోనే లైసెన్స్‌లు ఇచ్చేవారు. అయితే, ఇది ఇప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు https://pet.ghmc.gov.in/pl/mobile_validate అనే సైట్ లో ఇకపై పెంపుడు కుక్కలకు సంబంధించిన లైసెన్స్ ను పొందవచ్చు. మీ మొబైల్ నంబర్ ద్వారా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న తర్వాత, కుక్కకు సంబంధించిన టీకా సర్టిఫికేట్, కనీసం ఇద్దరు పొరుగువారి నుండి NOC, నివాస రుజువు (విద్యుత్ బిల్లు / నీటి బిల్లు / ఆధార్ / డ్రైవింగ్ లైసెన్స్) వంటి పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఆన్‌లైన్ లో రూ. 50 పెట్టి దరఖాస్తు చేసుకుంటే, అది వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయానికి ఫార్వార్డ్ చేయబడుతుంది. నిర్ణీత ధృవీకరణ తర్వాత, లైసెన్స్ అందించబడుతుంది. పశువైద్య సహాయ సంచాలకులకు వ్యక్తిగతంగా దరఖాస్తును సమర్పించడం ద్వారా లైసెన్స్ పొందడం మరొక మార్గం. "స్థానిక అధికారులకు అవసరమైన అన్ని పత్రాలను అందిస్తే.. లైసెన్సులు తప్పనిసరిగా జారీ చేస్తారు" అని పృధ్వి చెప్పారు.