డెలివరీ బాయ్స్.. ప్రమాదంలో జీవితాలు
Frantic Calls Bad Roads Fast Orders How Delivery Partners Risk Their Lives For Your Food. మార్చి 12వ తేదీ రాత్రి, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ అయిన 34 ఏళ్ల అమర్ రభా తన టీవీఎస్ జెస్ట్ స్కూటర్‌పై
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 March 2022 1:34 PM ISTమార్చి 12వ తేదీ రాత్రి, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ అయిన 34 ఏళ్ల అమర్ రభా తన టీవీఎస్ జెస్ట్ స్కూటర్‌పై గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లోని తన గది నుండి తన కజిన్ అయిన జహర్‌లాల్ రభాను కలవడానికి బయలుదేరాడు. జహర్‌లాల్, అమర్ రాత్రి భోజనం చేసారు. ఆ తర్వాత అమర్ రభా ఫుడ్ డెలివరీ ఉద్యోగానికి వెళ్లాడు. శనివారం రాత్రి కావడంతో ఎక్కువ పనితోపాటు మంచి జీతం కూడా వస్తుందని ఆశించాడు. అయితే ఆదివారం ఉదయం జహర్‌లాల్ కు తన సోదరుడి రూమ్‌మేట్ బుకాల్‌బోరో సంప్రదించాడు. అమర్‌కు ప్రమాదం జరిగిందని, కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది.
జహర్‌లాల్ ఆసుపత్రికి చేరుకోగా, అప్పటికే అమర్ చనిపోయినట్లు ప్రకటించారు. తెల్లవారుజామున 4:40 గంటలకు గోపన్‌పల్లి నుంచి నల్లగండ్ల వెళ్తుండగా అమర్ ప్రమాదానికి గురయ్యాడు. స్కూటర్ స్కిడ్ అయి కిందపడిపోయాడు. దారిన వెళ్తున్నవారు అతడిని 108 అంబులెన్స్ సహాయంతో కొండాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అతను చనిపోయినట్లు డ్యూటీ వైద్యులు ప్రకటించారని జహర్‌లాల్ తెలిపారు.
అమర్ స్వస్థలం అస్సాంలోని గోల్‌పరా జిల్లాలోని హతిగావ్ అగియా గ్రామం. "అతను కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు, అతను పక్కా రోడ్లు లేని గ్రామం నుండి వచ్చాడు. అతని తల్లి గ్రామంలో ఇళ్లలో పనిచేసేది.. కానీ అమర్ పని చేస్తూ తన తల్లిని చూసుకోవడం ప్రారంభించాడు. అతనికి తల్లి తప్ప మరెవరూ లేరు" అని హైదరాబాద్‌లోని అమర్ రూమ్‌మేట్ మృదుల్ డేకా తెలిపాడు.
2010లో హైదరాబాద్‌కు వచ్చిన అమర్ నగరంలోని నానక్రామ్‌గూడలో సెక్యూరిటీ గార్డుగా పని చేయడం ప్రారంభించాడు. ఫుడ్ డెలివరీ సేవల రాకతో, అతను 2013లో జొమాటోలో చేరాడు. తరువాత, స్విగ్గీకి మారాడు. నెలకు కనీసం రూ.30వేలు సంపాదించేవాడు.. పెట్రోలు, అద్దెకు ఖర్చు చేసి మిగిలిన డబ్బును తన తల్లికి పంపించేవాడని మృదుల్ తెలిపాడు.
అంజయ్య నగర్‌లోని ఒక గదిలో మొత్తం ఏడు మంది నివసిస్తున్నారని, అందరూ స్విగ్గీ లేదా జొమాటోలో పనిచేస్తున్నారని మృదుల్ తెలిపాడు. "సంపాదన ఎక్కువ ఉండడంతో ఉదయం 6 గంటల వరకు షిఫ్టులో పని చేసేవాళ్లం, డబ్బులు కాస్త ఎక్కువగా వస్తాయి. శనివారం ఎప్పటి లాగే పనిలో భాగంగా రూం నుంచి బయటకు వచ్చేశాం" అన్నాడు మృదుల్.
అమర్ మరణానంతరం స్విగ్గీ అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు లక్ష రూపాయలు చెల్లించడంతో పాటు అతని తల్లికి 50,000 రూపాయలు ఇచ్చింది. డెలివరీలు చేసే వ్యక్తుల నుండి కొంత డబ్బు సేకరించి అమర్ తల్లికి ఇచ్చాము. ఇన్సూరెన్స్ నుండి కొంత డబ్బు ఇస్తామని స్విగ్గీ చెప్పింది. నేను హైదరాబాద్‌కు వెళ్లి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తానని మృదుల్ తెలిపాడు. నగర శివార్లలోని నల్లగండ్లలో అభివృద్ధి పనుల శిథిలాలు రోడ్లపైనే పడి ఉండడం వలన వాహనదారులకు ప్రమాదాల బారిన పడుతున్నారు. అమర్ కూడా అదే దారిలో బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు ప్రమాదంలో డెలివరీ భాగస్వామి మృతి చెందడం ఇదే తొలిసారి కాదు. నెల రోజుల క్రితం మాదాపూర్‌లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను లారీ ఢీకొట్టింది.
ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రమాదకర జీవితం :
ప్రమాదాలు, ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులు, కస్టమర్ల నుండి తిట్లు.. ఇవి డెలివరీ భాగస్వాములు ప్రతిరోజూ ఎదుర్కొనే సాధారణ సమస్యలు." Swiggy యాప్‌లో రాత్రి 9 గంటల సమయంలో పీక్ టైమ్ ఉంటుంది. అది కూడా 40 నిమిషాలు చాలా బిజీ సమయం.. రెస్టారెంట్‌లు ఆర్డర్‌లతో నిండిపోయి ఉంటాయి. ఆర్డర్ ను డెలివరీ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్‌లు ఉంటాయి. కస్టమర్‌లు ప్రతి ఐదు నిమిషాలకు మేము ఎక్కడ అని అడుగుతూనే ఉంటారు. మేము ఆర్డర్‌ని ఎప్పుడు డెలివరీ చేస్తాం. తక్కువ రేటింగ్ పొందడం వంటి విషయాలపై మేము ఆందోళన చెందుతుంటాము. కాబట్టి, మేము సమయానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాము. మేము ట్రాఫిక్ లైట్‌లను దాటుకుని వెళ్లడం, వేగంగా వెళ్లడం వంటివి చేస్తే కానీ డెలివరీని చేయలేము. గతేడాది నాకు మూడు చిన్నపాటి ప్రమాదాలు జరిగాయి'' అని డెలివరీ భాగస్వామి మహేంద్ర తెలిపాడు.
కంపెనీ కూడా డెలివరీ భాగస్వాములపై కూడా సమయానికి డెలివరీ చేయాలని ఒత్తిడి తెస్తుంది. "ఒకవైపు కస్టమర్స్ సమయానికి చేరుకోనప్పుడు మాకు కాల్స్ చేయడం మొదలుపెడతారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్‌లు రోడ్డు బ్లాక్ అయినప్పటికీ మేము దానిని ఆలస్యంగా డెలివరీ చేస్తే జరిమానా విధించడం మొదలుపెట్టాయి. దీంతో మేము మరొక మార్గంలో వెళ్లాలి. మా వాహనం పంక్చర్ అయితే చాలా కష్టం. మా మాట వినేవారు లేరు. సమయానికి డెలివరీ చేయకుంటే కంపెనీ మా నుంచి ఫైన్ వసూలు చేస్తుంది. మరోవైపు మనం ఆర్డర్ తీసుకోవడానికి వెళ్లినప్పుడు రెస్టారెంట్ ముందు వాహనం పార్క్ చేసినా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. . గత నాలుగు నెలల్లో, తప్పుగా పార్కింగ్ చేసినందుకు నాకు మూడుసార్లు జరిమానా విధించబడింది" అని మరొక స్విగ్గీ డెలివరీ భాగస్వామి చెప్పారు. ఇటీవలి కాలంలో వారి ఆదాయం కూడా తగ్గిపోతోంది. గతంలో మూడు కి.మీ.లకు రూ.20 వచ్చేదని, ఇప్పుడు ఐదు కిలోమీటర్లకు రూ.20కి మారిందని స్విగ్గీ డెలివరీ భాగస్వామి తెలిపారు.
పొంచి ఉన్న ప్రమాదాలు :
డెలివరీ ఏజెంట్లు కూడా వివిధ రూపాల్లో రోడ్డు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరిలో, Zomato డెలివరీ భాగస్వామిని కొంతమంది వ్యక్తులు ఆపి దాడి చేశారు. అతను డెలివరీ చేస్తున్న ఆహారాన్ని కూడా లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. "రాత్రి వేళల్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు ఎవరైనా మనల్ని అడ్డుకుంటారేమోనని, మా ఆహారం, ఫోన్‌తో పాటు బైక్‌ను కూడా లాక్కుంటారేమోనని భయపడుతున్నాం. మాకు ఎలాంటి భద్రత లేదు, ప్రాణాలను పణంగా పెట్టి ఫుడ్ డెలివరీ చేస్తాం" అని మరో డెలివరీ పార్ట్‌నర్ చెప్పారు.
వేగవంతమైన డెలివరీ జీవితాలకే ప్రమాదం :
10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని వాగ్దానం చేసే డెలివరీ యాప్‌ల పెరుగుదలతో, డెలివరీ భాగస్వాములలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. "ఈ కిరాణా వస్తువుల డెలివరీ భాగస్వాముల భద్రతను ఎవరూ పట్టించుకోవడం లేదు. వాళ్లు కూడా మనుషులు, వారు రోబోలు కాదు. ఈ కిరాణా సామాగ్రి విషయంలో సదరు ప్లాట్‌ఫారమ్‌లు వాటిని అత్యవసరం చేస్తున్నాయి. మా డెలివరీ భాగస్వాములు వారి జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు." అని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు.
డెలివరీ భాగస్వాములు ప్రమాదాలకు గురైనప్పుడు వారికి సరైన పరిహారం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. "యాక్సిడెంట్లకి కొంత డబ్బు చెల్లిస్తున్నారు కానీ ఎవరికైనా కాలు విరిగితే ఎలా ఉంటుంది?.. హాస్పిటల్ బిల్లు కట్టి ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవాలి.. అతనికి పరిహారం ఎవరు ఇస్తారు?.. అమర్ విషయంలో అతని వయస్సును బట్టి పరిహారం చెల్లించాలి. యువకుడికి రూ.లక్ష నష్టపరిహారం ఇస్తే అతని తల్లికి ఏమీ సహకారం దక్కదు.. కుటుంబానికి కనీసం రూ.10 లక్షలు ఇవ్వాలని స్విగ్గీని అడుగుతున్నాం. ఒకరి వయస్సు ఆధారంగా పరిహారం లెక్కించబడుతుంది." అని షేక్ సలావుద్దీన్ జోడించారు.