ఆడపిల్ల వారింట మహాలక్ష్మి - ఎలా స్వాగతిస్తారో తెలుసా

family brought their newborn girlchild in a chopper. సరిగ్గా వారం రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మూడు నెలల పసి బిడ్డను

By Nellutla Kavitha  Published on  6 April 2022 3:10 PM GMT
ఆడపిల్ల వారింట మహాలక్ష్మి - ఎలా స్వాగతిస్తారో తెలుసా

సరిగ్గా వారం రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మూడు నెలల పసి బిడ్డను కన్న తండ్రి అమ్మకానికి ఉంచిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. శిశు విక్రయ ముఠా చేతుల్లో రోజుల వ్యవధిలోనే ఏడుగురు చేతులు మారింది ఆ చిన్నారి. ఆడపిల్ల ఆర్థికంగా భారం అవుతుందని అమ్ముకున్నాడు కసాయి తండ్రి. అయితే మన పొరుగునే ఉన్న మరో రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే, తన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ పండగ ఎలా జరుపుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

మహారాష్ట్ర పుణేకు చెందిన ఒక కుటుంబంలో ఆడపిల్ల పుట్టడంతో సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. నిజమే ఆ ఇంట్లో లేక లేక ఆడపిల్ల పుట్టడంతో ఆ చిన్నారికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి హెలికాప్టర్ నుంచి హెలీకాప్టర్‌ను అద్దెకు తీసుకొచ్చారు. ఆ వేడుకలను చూసేందుకు ఊరు ఊరంతా తరలి వచ్చింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక కుటుంబం అప్పుడే పుట్టిన ఆడపిల్లలు హెలికాప్టర్లో ఇంటికి తీసుకువెళ్లి ఘనస్వాగతం పలికింది. తమకు ఆడపిల్ల కావాలని కోరుకున్నామని, ఇక ఆ అమ్మాయికి అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి అని పెట్టామని ఆనందంగా చెప్పారు తండ్రి విశాల్ జారేకర్. జనవరి 22న భొసారి పట్టణంలో విశాల్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఆ చిన్నారిని ఏప్రిల్ 2న హెలికాప్టర్లో తమ కుటుంబం ఉన్నటువంటి షెల్గాం కు తీసుకువచ్చారు. తమ ఇంటి మహాలక్ష్మి కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మరీ హెలీకాప్టర్‌ను బుక్ చేస్తామంటున్నారు విశాల్. విశాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడపిల్ల పట్ల తండ్రి ప్రేమను గ్రామస్థులతో పాటుగా నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.

అయితే ఇదే సమయంలో ఇంకొక అనుమానం కూడా కనిపిస్తుంది. ఆర్థిక అసమానతలు ఆడపిల్లల మీద వివక్షకి కారణమవుతున్నాయి అనే అభిప్రాయం కూడా ఇంత కాలం వినిపించింది. దిగువ మధ్యతరగతి, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ఆడపిల్లలు భారమని మన సమాజంలో ఒక భావన ఉంది. అయితే ఆడపిల్లల్ని ఆదరించడానికి ఆర్థికంగా బాగా ఉండాల్సిన అవసరం లేదు, మనసు బాగుంటే చాలు అని నిరూపించారు కోలార్లో ఉన్న ఒక తండ్రి. ఇంట్లో ఆడపిల్ల పుడితే సంతోషంగా సంబరాలు చేసుకోవాలని, చేసి చూపించాడీ తండ్రి. మధ్యప్రదేశ్ కోలార్ కు చెందిన అంచల్ గుప్త పానీపూరీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది ఆగస్టు 17న ఆయన సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అవధుల్లేని సంతోషాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాడు అంచల్ గుప్తా. కోలార్ పట్టణంలో 50 వేలు ఖర్చు చేసి అందరికీ ఉచితంగా పానీపూరి పంచాడు. అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనే సందేశంతో అందరితో తన ఆనందాన్ని పంచుకున్నాడు గుప్త.


ఇక తెలంగాణకు చెందిన హరిదాస్ పూర్ గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లాలో ఉందీ గ్రామం. ఈ గ్రామంలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ఆ గ్రామమంతా పండుగలాగా జరుపుకుంటుంది. ఆడపిల్లలు శుభాన్ని తీసుకొస్తారని, వారి వల్ల మంచి జరుగుతుందని, వారిని గౌరవించాలి అని భావిస్తారు ఊరంతా. ఆడపిల్ల పుడితే భారం అని భావించకుండా ఉండడానికి బిడ్డ పుట్టిన వెంటనే తన పేరు మీద ఒక అకౌంట్ ని ఓపెన్ చేస్తారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆ అకౌంట్ లో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తుంది పంచాయితీ. దీంతోపాటుగా బిడ్డ పుట్టిన వెంటనే ఊరంతా మేళతాళాలు, విద్యుద్దీపాలతో సంబరాలను జరుపుకుంటారు. పిల్ల పుట్టిన వెంటనే స్వీట్లు పంచుకోవడంతో పాటుగా తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడం, వివక్షను దూరం చేయడం, ఆడబిడ్డను ఎంపవర్ చేయడమే లక్ష్యంగా జనవరి 1, 2020 న స్టార్ట్ అయిందీ కార్యక్రమం.


ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొచ్చినప్పటికీ, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా రావాల్సిన మార్పు ప్రజల నుంచే. ఆర్థికంగా ఉన్న అసమానతల్ని దూరం చేయడంతో పాటుగా, అవగాహనలు కూడా పెంచాల్సిన అటువంటి అవసరం ఇంకా ఉంది. ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం, వివక్ష నుంచి దూరంగా ఉంచడంతో పాటు, వారిని అన్ని విధాలుగా ఎంపవర్ చేయాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. వ్యక్తులు, కుటుంబం, సంస్థలు, సమాజం, ప్రభుత్వం…ఇలా అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే మార్పు కనిపిస్తుంది, ఆడపిల్లలు ముందుకు వెళ్తారు. సమాజంలో ఉన్న నెగటివ్ అంశాలతో పాటుగా, పాజిటివ్ న్యూస్ లు కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సిన ఎంతో ఉంది. మార్పు మనలోనే, మనతోనే రావాల్సిన అవసరం ఉంది.

















Next Story