బయటకు వెళ్తున్నారా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

COVID-19 Safety Protocols and precautions.ఇంటి నుంచి బయటకు వెళ్లి.. పని ముగించుకుని తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

By Medi Samrat  Published on  26 May 2021 8:20 AM GMT
covid protocols

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్డౌన్ లేదా కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో కోవిడ్-19 కేసుల సంఖ్య గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. మన రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను తెచ్చుకోవడానికి, ఇతర కార్యకలాపాల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 12వరకు సడలింపులు ఇచ్చారు. అయితే వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు. ఒకవేళ కూరగాయాలకు గానీ, కిరాణాషాపులు, మెడికల్ షాపులు, ఆఫీసులకు గానీ, ఇతర పనుల కోసం బయటకు రావాలి అనుకునేవారు నిర్లక్ష్యంగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లి.. పని ముగించుకుని తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

బయటి పనులకు వెళ్లేందుకు ప్రణాళిక తయారు చేసుకోండి

• మీరు అవసరమైన పనుల కోసం బయట తిరగవలసిన సందర్భాలను వీలైనంత వరకు తగ్గించుకోండి

• అత్యవసర సందర్భాల్లో బయటకు వెళ్ళాల్సి వచ్చినట్టయితే ఇతరులకు మీకు మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేట్లు చూసుకోండి

• షాపింగ్ చేసేటప్పుడు బండ్లు లేదా బుట్టలకు ఉన్న హ్యాండిల్స్ తుడవడం చేయకండి

• వీలైనంత వరకూ చేతికి గ్లౌజులు వేసుకోండి.. ముఖానికి మాస్కు ధరించండి.

• మీరు బయటికి వచ్చినప్పుడు తరచూ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోండి. మీ ముఖాన్ని తాకకుండా జాగ్రత్తగా ఉండండి

బయట నుండి మీరు ఇంటికి తిరిగి వచ్చాక

• మీ చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోండి

• మీరు బయటకు తీసుకెళ్లిన బాక్సులను మరియు ప్యాక్ చేసిన ఆహారాలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి శానిటైజ్ చేయండి.

• మీరు బయట నుండి తీసుకు వచ్చిన ఉత్పత్తులను, వస్తువులను వంటగదిలో ఉంచే ముందు వాటిని బాగా కడగాలి. ఒకవేళ నీటితో కడగలేనివి అయితే వాటిని ఎవరూ తాకని ప్రదేశంలో ఉంచండి.

వైరస్ రహితం చేసుకోవడం

• మీరు బయటి నుంచి వచ్చిన తర్వాత తాకిన ప్రతిదాన్ని అనగా డోర్ నాబ్స్ , లైట్ స్విచ్లు, తాళం చెవిలు, ఫోన్, కీబోర్డులు, రిమోట్లు మొదలైనవి శానిటైజ్ చేయండి.

• పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) ఆమోదించిన క్రిమిసంహారక మందులనే వాడండి

మీకు ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వస్తువుల డెలివరీ విషయంలో

• ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు ఏదైనా ఆన్లైన్ లో పార్సిల్ వచ్చిన వస్తువులను ఇంటి గుమ్మంలో లేదా మీ కాంప్లెక్స్ ప్రాంతంలోనే ఉంచమని సంబంధిత వ్యక్తులను అడగండి.

• సాధ్యమైనంత వరకు ఇలాంటి లావాదేవీలన్నీ ఆన్లైన్లో చెల్లించేలా జాగ్రత్త పడండి

• డబ్బులు చెల్లించాల్సి ఉంటే.. వారు మీ దగ్గరకు రావాల్సివచ్చినపుడు వారిని మీ ఇంటి తలుపులకు ఆరు అడుగుల దూరంలో ఉంచండి.

• ఒకవేళ మీకు ఉత్తరాలు, ఇతర పార్సిల్స్ ఏవైనా వస్తే వాటిని తీసుకున్న తర్వాత మీ చేతులును శుభ్రముగా కడుక్కోండి.

మన ఇంటికి అతిథులు వచ్చిన సందర్భాల్లో

• ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అతిథులను ఇంటికి పిలవకపోవడమే మంచిది.

• ఒకవేళ బంధువులు, స్నేహితులు ఎవరైనా వచ్చినా.. వారు మీ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉంటే, వీలైనంత వరకు ఒకే రూమ్ లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

• మీరు, మీ ఇంటికి వచ్చిన వారు ఒకే రూంలో ఉండాల్సిన పరిస్థితి ఉండే కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోండి

మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే

• మొదట మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించండి

• అనారోగ్యానికి గురైనవారు వాడిన వస్తువులను, ఆ వ్యక్తిని ప్రత్యేక విశ్రాంతి గదిలోకి మార్చండి

• ప్రతిరోజూ వారు తరచుగా తాకిన వస్తువుల ఉపరితలాలను శానిటైజ్ చేయండి

• వివిధ వస్తువులను వారితో పంచుకోవడం మానుకోండి

• వాషింగ్ మెషిన్ కడిగి శుభ్రం చేసిటప్పుడు చేతికి గ్లౌజులు ధరించండి

• మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం మంచిది

• అనారోగ్యానికి గురైనవారు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి.

ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

• రెడీమేడ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, రొట్టెలు, పాస్తా, కూరగాయలు, పండ్లు అవసరమైన మేరకు నిలువ చేసుకోవాలి.

• బయటి నుంచి తెచ్చుకున్న కూరగాయాలు, ఇతర ఆహార పదార్థాలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

పైన చెప్పిన విషయాలను ప్రతిఒక్కరూ తప్పక పాటించినట్టయితే మనతోపాటు మన ఇంట్లో వారు కూడా వైరస్ నుండి సురక్షితంగా ఉంటారు. తద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టినవారం అవుతాము. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుందాం.. వైరస్ బారినపడకుండా ఉందాం..




Next Story