బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా.?

CM KCR Munugodu Meeting Highlights. విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బ్యాంకులు, ఎల్‌ఐసీలు అన్నీ అమ్ముతున్నారని

By Medi Samrat  Published on  20 Aug 2022 5:02 PM IST
బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా.?

విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బ్యాంకులు, ఎల్‌ఐసీలు అన్నీ అమ్ముతున్నారని కేంద్రంపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్‌. మునుగోడులో జ‌రిగిన‌ ప్రజా దీవెన సభలో టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులపై భారం మోపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఇప్పుడు చెప్తోందని అన్నారు. నష్టాలు వచ్చి రైతులు సాగు బంద్‌ చేయాలనేది బీజేపీ కుట్ర అని అన్నారు.

రైతులు సాగు బంద్‌ చేస్తే.. కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నారని.. రైతుల భూములను అంబానీ, అదానీ లాంటి వాళ్లకు అప్పగించాలని చూస్తున్నారని అన్నారు. నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని నిప్పులు చెరిగారు.

మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చిందని సీఎం కేసీఆర్ అడిగారు. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అన్నారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెరాసకు మద్దతు ప్రకటించిన సీపీఐకు కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు నుంచి ఢిల్లీ వరకు ఐక్యత కొనసాగాలని సీఎం అన్నారు. విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఏవీ మనకు రాలేదని అన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే.. 8 ఏళ్లుగా తేల్చటం లేదని.. కృష్ణా జలాల్లో మీకు వాటా ఇచ్చేది లేదని చెప్పేందుకు అమిత్‌ షా వస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు.. సాధించేవరకు పోరాడుతూనే ఉంటామ‌ని అన్నారు. కృష్ణా జలాల్లో వాటా గురించి బీజేపీ నేతలు మోదీ, అమిత్ షాను ఎప్పుడైనా అడిగారా? అని ప్ర‌శ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి రేపు మునుగోడులో చెప్పాలని అమిత్‌షాను డిమాండ్ చేశారు.

బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా? అని ప్ర‌శ్నించారు. విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బ్యాంకులు, ఎల్‌ఐసీలు అన్నీ అమ్ముతున్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధ పడిందో తెలుసని అన్నారు. ఫ్లోరైడ్‌ బాధితుడిని దిల్లీకి తీసుకెళ్లి చూపించినా.. మన మొర ఎవరూ వినలేదని.. గతంలోని ఏ పాలకుడు మునుగోడు ఫ్లోరైడ్‌ కష్టాలను తీర్చలేదని తెలిపారు.

15 రోజులు జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్‌ కష్టాలపై అవగాహన కల్పించాం. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామ‌ని అన్నారు. ఇప్పుడు మిషన్‌ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోరైడ్‌ జిల్లాగా మారామ‌ని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నో మ్యాన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. మేధావులు హెచ్చరించినా.. ఫ్లోరైడ్‌ గురించి గత పాలకులు ఆలోచించలేదని అన్నారు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదని అన్నారు.


Next Story