ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు..

Beautiful view of Asia's largest Tulip Garden. జబర్వాన్ కొండల్లోని తులిప్ పూల వనం ప్రకృతి ప్రేమికులను సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.

By Medi Samrat  Published on  29 March 2021 2:17 AM GMT
Tulip Garden

భారతదేశం భూతాల స్వర్గం అందాల సుందర లోయ కాశ్మీర్ లో తులిప్ పువ్వులు విరబూశాయి. జబర్వాన్ కొండల్లోని తులిప్ పూల వనం ప్రకృతి ప్రేమికులను సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. తెలుపు, ప‌సుపు, ఎరుపు, పింక్, బ్లూ ఇలా ర‌క ర‌కాల రంగుల్లో.. ఆకాశం నుంచి చూస్తే.. ఇంద్ర ధ‌ను‌స్సు నేల మీద విరిసిందా.. అన్న‌ట్లుగా ఆ తులిప్స్ త‌మ అందాల‌తో చూపరులను క‌నువిందు చేస్తున్నాయి. సృష్టిలోని అంద‌మంతా త‌మ‌లోనే దాగుంద‌న్న‌ట్లు.. ప‌ర్యాటకుల చూపును త‌మ‌వైపు తిప్పుకుంటాయి. వాటిని చూసేందుకు నిజంగా మ‌న రెండు క‌ళ్లూ చాల‌వంటే అతిశ‌యోక్తి కాదు.

మీరు చూస్తున్నది శ్రీనగర్ లోని దాల్ లేక్ స‌మీపంలో జ‌బ‌ర్వాన్ రేంజ్‌లోని ప‌ర్వ‌తసానువుల్లోని గార్డెన్. ఇది ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్‌ల‌లో ఒక‌టి. తులిప్‌ అంటే లాటిన్‌ భాషలో తలపాగా అని అర్థం. చూడగానే అందంగానే కాదు ఆహ్లాదాన్ని కలిగించే ఈ పూలు తలలో పెట్టుకోవడానికి పనికిరావు. కానీ అలంకరణలో మాత్రం తమ రాజసాన్ని చూపిస్తాయి.

మూడు రేకలతో అరవిరిసినట్టు ఉండే ఈ మొగ్గలకే గిరాకీ ఎక్కువ. సాధారణంగా తులిప్‌ పూలను బహుమతిగా ఇచ్చేందుకు ఎంచుకుంటారు. తెలుపు రంగు తులిప్‌ స్వచ్ఛతకి, ఎరుపు సిసలైన ప్రేమ, గులాబీ రంగు తులిప్‌ను అభినందనకి, ఆరెంజ్‌ తులిప్‌ శక్తి, కోరికను తెలియజేసేందకు, నీలం ప్రశాంతతకి చిహ్నంగా ఎంచుకుంటారు. నిజానికి తులిప్‌ పువ్వుల్లో అసలైనవి పదిరంగులే. మిగతావన్నీ కృత్రిమ జాతులే. చల్లగా, తేమగా ఉండే నేలలే తులిప్‌ సాగుకి అనువైనవట.వేడి ప్రాంతాల్లో అయితే వసంతకాలం పూతకి అనుకూల సమయం.

జమ్మూకశ్మీర్‌లోని జబర్వాన్‌ కొండలకు దిగువన ఈ తులిప్‌ తోటలో 64 రకాల 15లక్షలకు పైగా వివిధ పూలు కనువిందు చేస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ తోట తెరుచుకుంది. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సి జాగ్రత్తలనూ తీసుకుంటూ సందర్శకులను అనుమతిస్తున్నారు. శానిటైజర్‌, థర్మల్‌స్కానింగ్‌ ఏర్పాటు చేశారు. మాస్కు ఉన్న వారినే అనుమతిస్తున్నారు.



Next Story