ఎయిర్‌టెల్‌ యూజర్లకు హెచ్చరిక.. ఆ లింకులు క్లిక్‌ చేస్తే అంతే..

Airtel Alerts Their users. ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోయాయి. తెలివైన వారిని కూడా

By Medi Samrat  Published on  30 Jan 2021 4:17 AM GMT
ఎయిర్‌టెల్‌ యూజర్లకు హెచ్చరిక.. ఆ లింకులు క్లిక్‌ చేస్తే అంతే..

ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోయాయి. తెలివైన వారిని కూడా అమాయకులుగా చేసి నట్టెట ముంచుతున్నారు. ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తమ యూజర్లను హెచ్చరించింది. సైబర్‌ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు చేసింది. అనుమానస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయవద్దని సూచిస్తోంది. ఇటీవల యూజర్ల కేవైసీ అప్‌డేట్స్‌ పేరుతో కొన్నిలింకులు ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఎయిర్‌టెల్‌ యూజర్ల ఫోన్‌లకు వస్తున్నాయి. ఎయిర్ టెల్‌ అని వచ్చిన లింకులను పొరపాటుపడి వాటిని క్లిక్‌ చేసినట్లయితే మీరు సైబర్‌ నేరగాళ్లకు చిక్కి బాధితులవుతున్నారని తెలిపింది.

అయితే.. కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే మీ మొబైల్‌ సర్వీసులు నిలిచిపోతాయని సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. కంగారులో ఎయిర్ టెల్‌ వినియోగదారులు అప్‌డేట్‌ చేసుకోవాలని లింక్‌పై క్లిక్‌ చేసి మోసపోతున్నారని తెలిపింది. ఎయిర్‌టెల్‌ యూజర్లకు కేవైసీ విషయంలో హెచ్చరించిన ఫోటోను హైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఎయిర్‌టెల్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, యూజర్లు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచించింది.

ఆన్‌లైన్ ద్వారా ఫోన్‌ కాల్‌ చేసి కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలంటూ మీ ఆధార్‌, ఓటీపీ వివరాలు అడుగుతున్నారని, అలా అన్ని వివరాలు వారికి చెప్పినట్లయితే మీ బ్యాంకు వివరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఇలా ఎయిర్‌టెల్‌ యూజర్లు కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ ఏవేవో లింకులు పంపిస్తూ మిమ్మల్ని చిక్కుల్లో చిక్కేలా చేస్తున్నారని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అలాగే వారు పంపిన లింకులపై ఓపెన్‌ చేయగానే బ్యాంకు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలు ఎంటర్‌ చేయాల్సిందిగా అడుగుతారు. ముందుగా రూ.10 చెల్లిస్తే మొబైల్‌ సేవలు కొనసాగుతాయని, ఇలా మిమ్మల్ని నమ్మబలికి మీ వివరాలు తెలుసుకునేలా చేస్తారని, ఆ తర్వాత మీ వ్యక్తిగత సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ మాయమవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లింకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.




Next Story