తనవారిని అల్లరి మూకలనుంచి ఆ 'వంటింటి కుందేలు' ఎలా కాపాడుకుంది?

By అంజి  Published on  1 March 2020 10:41 AM GMT
తనవారిని అల్లరి మూకలనుంచి ఆ వంటింటి కుందేలు ఎలా కాపాడుకుంది?

ఆమె మామూలుగా ఇంటికే పరిమితం, మరో మాటలో చెప్పాలంటే వంటింటి కుందేలు. ఇంట్లో కుట్టుపని చేసి, భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అలా ఎండకన్నెరగని ఆమె ఇంట్లోంచి దూసుకు వచ్చి, అల్లరి మూకల్ని దాటి, దాదాపు నలభై మంది బంధువులను కాపాడింది. ఢిల్లీ అల్లర్ల చీకట్లో ఆమె ఒక చిరు వెలుగు. సాహసాన్ని, తెగువను చూపించి, తనవారిని అల్లరి మూకలనుంచి కాపాడుకున్న ముష్తారీ ఖాతూన్ కథ ఇది.

ఫిబ్రవరి 25 న అల్లర్లు ప్రారంభం కాగానే, అల్లరి మూకల మధ్య చిక్కుకుపోయి ఉన్న తమ బంధువులు ఆమెకు గుర్తుకి వచ్చారు. వారు తమ తమ ఇళ్లలో ఉన్నా చుట్టూ పరిస్థితి దారుణంగా ఉంది. వారిని ఎలాగైనా సురక్షితంగా బయటకి తేవాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె ఒక కిలో మీటర్ పాటు రాళ్లు విసురుతున్న మూకలను తట్టుకుని పరుగులు తీసింది. ఎలాగోలా వారి వద్దకు చేరుకుంది. ఆమె ఉండేది చందూ నగర్. అది కాస్త సురక్షితం. బంధువులుండేది ఖజూరీ ఖాస్. అక్కడ అసురక్షితం. ఆమె అక్కడకు చేరుకుని వారందరినీ కలుసుకుంది. ఆ తరువాత రోడ్ల మీదుగా వెళ్తే ప్రమాదకరమని భావించి, ఆమె వారందరినీ ఇళ్ల పై కప్పుల నుంచి తీసుకువచ్చింది. ఒక డాబా నుంచి మరో డాబాకి చేరుకుని వారందరినీ తీసుకురాగలిగింది. ఆ ప్రాంతంలో ఇళ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. కొన్ని చోట్ల డాబాలు దాదాపుగా ఆనుకున్నంత దగ్గరగా ఉంటాయి. కాబట్టి అల్లరి మూకల కంట పడకుండా ఆమె తీసుకురాగలిగింది. ఈ సాహసోపేత చర్య వల్ల ఇప్పుడామె తనకాలనీలో ఒక హీరోగా మారిపోయింది.

సోమ, మంగళ వారాల్లో హింస పెద్దగా చెలరేగింది. తమ బంధువులందరూ ఉండే ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దీంతో బుధవారం తెల్లవారు జామునే ఆమె ప్రాణాలకు తెగించి బయలుదేరింది. చివరికి వారిని చేరుకున్నాక అల్లర్ల తీవ్రత పెరిగింది. మూకలు దౌర్జన్యానికి తెగబడ్డాయి. దీంతో స్థానికుల సాయంతో ఆమె వారిని తీసుకుని తిరుగు ప్రయాణానికి బయలుదేరింది. చివరికి ఒక పోలీసు బృందం ఉన్నచోటకు చేరుకుంది. ఆ తరువాత పోలీసులే ఆమెను, ఆమె బంధువులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఇలా ఆమె ఎనిమిది కుటుంబాలను కాపాడింది.

Next Story