ప్రమాదంలో మెట్రో పిల్లర్‌: భారీ వర్షానికి పిల్లర్‌ వద్ద కుంగిపోయిన భూమి

By సుభాష్  Published on  14 Oct 2020 11:43 AM GMT
ప్రమాదంలో మెట్రో పిల్లర్‌: భారీ వర్షానికి పిల్లర్‌ వద్ద కుంగిపోయిన భూమి

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరం అతాలకుతలం అవుతోంది. భారీ వర్షాల ధాటికి నగరంలోని మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో మార్గంలో మూసాపేట మెట్రో స్టేషన్‌ వద్ద మెట్రో పిల్లర్ల చుట్టూ భూమి కుంగి గుంతల్లోకి నీరు చేరడంతో ఆందోళన వ్యక్తం అయింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు మెట్రో పిల్లర్‌ వద్దకు చేరుకుని మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన మెట్రో ఇంజనీర్లు ప్రస్తుతం మూసాపేట దగ్గర పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మెట్రో స్టేషన్ కు దగ్గరలోని చెరువు కట్ట తెగడం వల్లనే రోడ్డు కుంగిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

రహదారిపై వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా మెట్రో పిల్లర్‌ వద్ద భూమి కుంగిపోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ నగరం భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోతోంది. ఈ భారీ వర్షం కారణంగా దాదాపు 15 మంది మృత్యువాత పడ్డారు. పాతబస్తీలో ఇళ్లు కూలి 9 మంది మృతి చెందగా, ఇతర ప్రాంతాల్లో మరి కొందరు మృత్యువాత పడ్డారు.

ఇక చాదర్‌ఘాట్‌ వద్ద మూసీనది ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్‌ సాగర్‌కు వరద తాకిడి పెరిగింది. నగరంలో దాదాపు వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపార్టుమెంట్లలోని సెల్లార్లు నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘట్‌కేసర్‌లో అత్యధికంగా 32.3 శాతం వర్షపాతం నమోదైంది. నగరంలోని రోడ్లన్నీ నదుల్లా, చెరువుల్లా మారిపోయాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.



Next Story