ఆగని వర్మ.. 'మర్డర్' నుంచి మరో పోస్టర్ విడుదల
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2020 5:34 AM GMTనిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'మర్డర్'. ఫాదర్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ.. తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేదిగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రణయ్ హత్యకు గురికావడం, అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వంటి సన్నిశాలతో యథార్థగాధ ఆదారంగా ఈ సినిమా తీస్తున్నట్లు వర్మ తెలిపిన విషయం తెలిసిందే. సమాజంలో సంచలనం సృష్టించిన ఘటనలు నేపథ్యంలో సినిమాలు తీయడంలో వర్మ దిట్ట. ఇప్పటికే 'రక్తచరిత్ర' వంటి సినిమాలు తీసి మెప్పించాడు వర్మ. దీంతో మర్డర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. అమృత రాసినట్లు ఉన్న ఓ పోస్టు వైరల్ గా మారింది. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? దీని వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నాను. ఎవరికి వారు నా గురించి, నా క్యారెక్టర్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. ‘‘నువ్ విడుదల చేసిన పోస్టర్ చూశాను. దీనికి, నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీ లాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను.ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే. ఎన్నో బాధలను అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్ ఇన్ పీస్’’ అని అమృత ఓ ప్రకటన చేసినట్టుగా చీరాల సమాచారం అనే ఫేస్‌బుక్ పేజీలో ఓ కథనం వైరల్ అవుతుంది.
ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ.. మర్డర్ సినిమా పస్ట్‌లుక్ విడుదల విషయమై దర్శకుడు మా ఫ్యామిలీతో ఎటువంటి సంప్రదింపులు చేయలేదని అన్నారు. మేమింకా కొడుకు చనిపోయిన బాధలోనే ఉన్నామని.. అమృతకు న్యాయం జరగడం కోసం పోరాటం చేస్తామని అన్నారు. దర్శకుడు ఎందుకు సినిమా చేస్తున్నాడో తెలియదని.. సోషల్ మీడియాలో అమృత చేసినట్టుగా వస్తున్న కథనాలు పూర్తిగా కల్ఫితాలని అన్నారు.