దారుణ హత్య.. హంతకున్ని పట్టించిన ఆధార్ కార్డు
By సుభాష్ Published on 29 Feb 2020 9:53 PM ISTసొంత బాబాయ్‌నే దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సొంత బాబాయ్‌ని అన్న కొడుకే దారుణంగా చంపేసినట్లు తేలింది. కులాంతర వివాహం చేసుకునేందుకు బాబాయ్ సిద్ధం అయ్యాడని, అందుకే హత్య చేసినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.
సుధాకర్ శర్మ అనే వ్యక్తి గత నెల 28 నుంచి కనిపించకుండా పోయారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. అయితే ఘటన ప్రాంతంలో ఓ ఆధార్ కార్డు పోలీసులకు లభించింది. ఆ ఆధార్ కార్డును పరిశీలిస్తే సుధాకర్ అన్నకొడుకు నిఖిల్‌ది గుర్తించారు. ఆధార్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలైన నిందితుడు దొరికిపోయాడు. పోలీసుల దర్యాప్తులో సుధాకర్ శర్మను అన్న కొడుకు నిఖిల్ శర్మనే హత్య చేసినట్లు తేలింది. కాగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
సుధాకర్ శర్మ బీహార్‌కు చెందిన ఓ మహిళను కులాంతర వివాహం చేసుకోవడానికి సిద్ధం కాగా, అది నచ్చని నిఖిల్ శర్మ బాబాయ్‌కి పదేపదే చెప్పినట్లు పోలీసులు వివరించారు. తక్కువ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, ఒక వేళ చేసుకుంటే ఇంటి పరువు పోతుందని బాబాయ్ తో గొడవకు దిగాడు. ఎంత చెప్పిన బాబాయ్ సుధాకర్ వినకపోవడంతో నిఖిల్ గొంతు నులిమి హత్య చేశాడు. కాగా, ముందుగా సుధాకర్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని విమలేష్ శర్మ, కొడుకు నిఖిల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆధార్ కార్డు ఆధారంగా నిందితుడు బయటపడ్డాడు. దీంతో పోలీసులు నిందితున్ని కటకటాల్లోకి నెట్టారు.