యూపీలో దారుణం : పోలీసులు చూస్తూ ఉండగానే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 8:46 AM GMT
యూపీలో దారుణం : పోలీసులు చూస్తూ ఉండగానే..!

ఖుషి నగర్, ఉత్తరప్రదేశ్ : ఓ స్కూల్ టీచర్ ను చంపేశాడన్న అభియోగాలు ఓ వ్యక్తిపై నమోదయ్యాయి. ఆ వ్యక్తిని నడిరోడ్డులోనే అందరూ కలిసి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అది కూడా పోలీసుల ఎదుటే ఈ ఘటన చోటుచేసుకుంది. ఖుషీ నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతోంది.

అల్లర్లను అడ్డుకునే సమయంలో పోలీసులు ధరించే వస్తువులను వారు ధరించి ఉండగా.. కొందరు వ్యక్తులు అతడిని చితక్కొడుతూ కనిపించారు. అతడు రక్తపు మడుగులో ఉండగా పోలీసులు కొందరిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. అప్పటికే అతడు తీవ్రంగా రక్తాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. తల భాగంలో అతడికి తీవ్రగాయాలు అయినట్లు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఆ వ్యక్తి గోరఖ్ పూర్ కు చెందిన వ్యక్తిగా భావించారు. తన తండ్రి తుపాకీని తీసుకుని సదరు వ్యక్తి టీచర్ ను కాల్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

టీచర్ ను కాల్చిన తర్వాత ఆ వ్యక్తి తన ఇంటి మీదకు ఎక్కి నిలబడ్డాడు. చుట్టుపక్కల ఉన్న వారు తన వైపు రాకుండా ఉండేదుకు తుపాకీతో గాల్లోకి కాల్చాడు. కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు రావడంతో సరెండర్ అయ్యాడు. పోలీసులు అతడి దగ్గర ఉన్న తుపాకీని తీసుకుని పోలీసు జీపులో కూర్చోబెడుతున్న సమయంలో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసు వాహనం నుండి అతడిని లాక్కొని వచ్చి మరీ దాడి చేసి చంపేశారు.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it