ముంచుకొస్తున్న నిసర్గ.. ఆ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 10:28 AM GMT
ముంచుకొస్తున్న నిసర్గ.. ఆ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

ముంబై నగరం మీదకు నిసర్గ తుఫాను ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు దగ్గరగా వస్తోంది. రాబోయే గంటల్లో మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ముంబై మీదకు రేపటికల్లా కరోనా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కరోనా కేసులతో విలవిలలాడుతున్న ముంబై మహా నగరాన్ని తుఫాను అతలాకుతలం చేయబోతోంది.

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం మంగళవారం రాత్రికి తీవ్ర తుఫానుగా మారుతుంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబయితో పాటు తీర ప్రాంత జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. గుజరాత్ దక్షిణ భాగం, డామన్, డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 4 వరకు మత్స్యకారులెవరూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని సూచనలు జారీ చేశారు. అక్కడి పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరేతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. నిసర్గ తుఫానుతో గంటలకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఇప్పటికే గుజరాత్‌, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ముంచుకొస్తున్న తుఫానుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిపై ఓ అంచనా వేస్తున్నామని.. అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నామని.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

30కి పైగా ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో సిద్ధంగా ఉంచారు. ఒక్కో టీమ్ లో 45 మంది ఉంటారు. గుజరాత్ రాష్ట్రం ఇంకో 5 టీమ్ లు కావాలని కోరిందని ఎన్.డి.ఆర్.ఎఫ్. ఛీఫ్ ఎస్.ఎన్.ప్రధాన తెలిపారు.

20000 మందికి పైగా గ్రామస్థులను గుజరాత్ తీరప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకొంత మందిని కూడా తరలిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఉద్దవ్ థాకరే సూచించారు. ఈ తుఫాను కారణంగా చాలా నష్టం సంభవించే అవకాశం కూడా ఉందని.. ఇళ్లకు చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పవర్ కట్స్, తీర ప్రాంతాల్లోని పంటలకు నష్టం కలిగే అవకాశం ఉంది.

అంఫాన్ తుఫాను దెబ్బకు బెంగాల్ లో 99 మంది దాకా చనిపోయారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు మరో తుఫాను భారత్ మీదకు ముంచుకొస్తోంది. ఈసారి ప్రకృతి ప్రకోపానికి ఎంత మంది బలవుతారో.

Next Story