పొలార్డ్ విషయంలో ముంబై ఇండియన్స్ కు సూచనలు చేసిన గంభీర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Sep 2020 12:50 PM GMTముంబై ఇండియన్స్ జట్టులోని కీలక ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్ ఒకడు. తనదైన రోజు అద్భుతమైన బ్యాటింగ్ తో విజయాన్ని అందించగలడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు మరో టైటిల్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు పొలార్డ్.
పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ జట్టులో సాధారణంగా లోయర్ ఆర్డర్ లో పంపుతారు. దీనిపై భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పొలార్డ్ ను నాలుగో నంబర్ లో కానీ.. ఐదో నంబర్ లో కానీ బ్యాటింగ్ కు పంపాలని సూచించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో పొలార్డ్ ఆటతీరును గమనిస్తూ ఉన్నామని.. అతడి బ్యాటింగ్ విధ్వంసం ఐపీఎల్ లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నానని గంభీర్ అన్నాడు. అయితే ముంబై ఇండియన్స్ అతడిని ఎలా వాడుకుంటుందో అన్నది ఆసక్తికరమైన విషయమని తెలిపాడు.
ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే పొలార్డ్ బ్యాటింగ్ విషయంలో ఆనందంగా ఉండే ఉంటాడని.. పొలార్డ్ ఫామ్ ను ఉపయోగించుకోవాలి అంటే అతడిని నాలుగు లేదా ఐదో స్థానాల్లో పంపాలని అన్నాడు. అంత కంటే తక్కువ ఆర్డర్ లో పంపించడం కూడా చాలా పొరపాటు అవుతుందని అన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో మంచి బ్యాటింగ్ పవర్ ఉందని అభిప్రాయపడ్డాడు గంభీర్.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ గా అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ లో ఉన్న పొలార్డ్ ఐపీఎల్ లో కూడా బాగా ఆడాలని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టు పొలార్డ్ ఫామ్ చూసి హ్యాపీగా ఉంటుంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో బార్బడోస్ ట్రైడెంట్స్ తో మ్యాచ్ లో అతడు తన జట్టును గెలిపించుకున్న తీరు అద్భుతం.
మ్యాచ్ విన్నింగ్ ఆట తీరుతో ఒంటరిగానే విజయాన్ని అందించగల సత్తా అతడికి సొంతమని అగార్కర్ తెలిపాడు. అతడున్న ఫామ్ ను చూస్తుంటే ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగలడు.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు కొన్ని సార్లు వచ్చాడు.. అయిదు, ఆరో స్థానంలో అతడు బ్యాటింగ్ కు వచ్చినప్పుడు బౌలర్ల మీద తప్పకుండా ఒత్తిడి ఉంటుందని అగార్కర్ చెప్పాడు. ఏది ఏమైనా ఈ ఏడాది ఐపీఎల్ లో అతడి ఆటను అందరూ ఎంజాయ్ చేస్తారని అన్నాడు.