ధోని భవితవ్యంపై ఒక్క మాటలో తేల్చేసిన సెలక్టర్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2020 7:43 PM IST
ధోని భవితవ్యంపై ఒక్క మాటలో తేల్చేసిన సెలక్టర్‌..!

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని టీమిండియా జెర్సీలో కనిపించి దాదాపు ఏడాది కావొస్తోంది. 2019 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ధోని క్రికెట్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. అయితే ధోని రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ కెప్టెన్‌ కూల్‌ రీ ఎంట్రీ టీమిండియ కొత్త సెలక్షన్‌ కమిటీ క్లారిటీ ఇచ్చేసింది. ధోని ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ఖచ్చితంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) లో సత్తా చాటాల్సిందేనని స్పష్టం చేసింది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పదవీకాలం ముగియడంతో కర్ణాటకకి చెందిన సునీల్ జోషి చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

కొత్త చీఫ్ సెలక్టర్‌ అధ్యక్షతన దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు 15మందితో కూడిన భారత జట్టును ఆదివారం ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాలతో పాటు భువనేశ్వర్‌ కుమార్‌ ఎంపికయ్యారు. కాగా.. ఈ సమావేశంలో మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని గురించి మాట్లాడే అవకాశమే రాలేదని బీసీసీఐ అధికారి చెప్పారు. ఈ సెలక్షన్‌ కమిటీ సమావేశం సూటిగా, చాలా స్పష్టంగా సాగింది. ఐపీఎల్‌లో ధోని మంచి ప్రదర్శన చేస్తేనే తిరిగి భారత జట్టులోకి వస్తాడు. అతనొక్కడే కాదు, ఐపీఎల్‌లో చాలా మంది సీనియర్‌, జూనియర్‌ క్రికెటర్లు ఉన్నారు. వారు కూడా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారు. ఎవరు రాణిస్తే వారికే జట్టులో అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచకప్‌ జట్టులో కొన్ని ఆశ్చర్యకర ఎంపికలు జరగొచ్చు అని ఓ అధికారి చెప్పారు.

దీంతో ఐపీఎల్-13వ సీజన్‌లో ధోని తప్పక రాణించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో చైన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. కాగా ధోని ఇప్పటికే చెపాక్‌ స్టేడియం ప్రాక్టీస్‌ మొదలు పెట్టేశాడు.

Next Story