టీ20 సిరీస్‌లో సచిన్‌-సెహ్వాగ్‌ల విధ్వంసం.. పాతరోజుల్ని గుర్తు చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2020 8:49 AM GMT
టీ20 సిరీస్‌లో సచిన్‌-సెహ్వాగ్‌ల విధ్వంసం.. పాతరోజుల్ని గుర్తు చేశారు

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌, సెహ్వగ్‌ల జోడి మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది. క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుని చాలా కాలమే అయినా తమలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపించింది. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్ టీమ్ తరఫున సచిన్, సెహ్వాగ్ ఓపెనర్లుగా ఆడి అభిమానుల్ని అలరించారు. వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్‌-వెస్టిండీస్‌ లెజెండ్స్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ (74; 57 బంతుల్లో 11పోర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సచిన్ టెండూల్కర్ (36; 29 బంతుల్లో 7పోర్లు) తన దైన శైలిలో అభిమానులను అలరించారు.

ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ చందర్‌పాల్ (61; 41 బంతుల్లో 6పోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకం సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో జహీర్ ఖాన్ (2/30), మునాఫ్ పటేల్ (2/24), ప్రగ్యాన్ ఓజా (2/27) రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ ఫఠాన్ (1/21) ఫర్వాలేదనిపించాడు.

151పరుగుల లక్ష్యంతో బరిగిన ఇండియా లెజెండ్స్‌కు ఓపెనర్లు సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ లు శుభారంభం అందించారు. సచిన్‌ తన అప్పర్‌ కట్ షాట్లతో అలరించగా.. సెహ్వగ్‌ దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. తొలి వికెట్‌కి 10.2 ఓవర్లలోనే 83 పరుగులు జోడించారు. సచిన్ ఔట్ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మహ్మద్ కైఫ్ (14;16 బంతుల్లో 1 పోర్‌) నిరాశపరచగా.. యువరాజ్ సింగ్ (10 నాటౌట్; 7 బంతుల్లో 1సిక్స్‌) రాణించడంతో 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 151 లక్ష్యాన్ని చేధించింది. సెహ్వాగ్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ మ్యాచ్‌గా అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్ తర్వాత మ్యాచ్‌ని శ్రీలంకతో మంగళవారం ఆడనుంది.

రోడ్డు సేప్టీపై అవగాహన పెంచేందుకు..

దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వాహనదారులు, ప్రజల్లో అవగాహన పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఫండ్స్‌ సేకరణ కోసం ఐదు దేశాల మాజీ క్రికెటర్లతో ఈ రోడ్ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌ని నిర్వహిస్తోంది. భారత్‌ నుంచి ఇండియా లెజెండ్స్ టీమ్ తరహాలోనే ఆస్ట్రేలియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ రూపంలో మొత్తం ఐదు జట్లు టోర్నీలో ఆడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లన్నీ ముంబయి, పుణెలో.. మార్చి 7 నుంచి 22 వరకూ రాత్రి 7 గంటలకి జరగనున్నాయి.

Next Story
Share it