రూ.30లక్షల కోసమే ధోని క్రికెట్ ఆడాడు.. కానీ..
By తోట వంశీ కుమార్ Published on 29 March 2020 3:43 PM GMTభారత క్రికెట్ చరిత్రలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన పేరును సువర్ణాక్షరాలతో లికించుకున్నాడు. భారత్ కు రెండు ప్రపంచ కప్‌లు(2007టీ20, 2011 వన్డే ప్రపంచకప్) అందించిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సంపాదిస్తున్న క్రికెటర్లలో ధోని టాప్-10లో ఉంటాడు. కాగా ధోని గురించి ఇటీవల రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు.
రాంచీలో తాను ప్రశాంతంగా జీవించేందుకు రూ. 30 లక్షలు ఉంటే చాలని ధోనీ అప్పట్లో తనకి చెప్పినట్లు జాఫర్ తాజాగా వెల్లడించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కొత్తలో ధోనీ నాతో ఓ సారి మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడటం ద్వారా రూ. 30 లక్షలు సంపాదించుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఆ డబ్బుతో రాంచీలో ప్రశాంతమైన జీవితం తాను గడపగలనని అప్పట్లో ధోనీ నాకు చెప్పినట్లు గుర్తు’’ అని జాఫర్ తెలిపాడు.
2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరగ్రేటం చేసిన ధోని తొలి మ్యాచ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మూడు వన్డేలు ఆడిన కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు., అయితే.. వైజాగ్ వన్డే తొలి కెరియర్ ను మార్చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన ధోని 148 పరుగులతో చెలరేగిన చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ తరువాత ధోని వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఇప్పటి వరకూ ఏ కెప్టెన్ కూడా మూడు ఐసీసీ టోర్నీలు గెలవలేదు. అనధికార లెక్కల ప్రకారం ప్రస్తుతం ధోనీ ఆస్తుల విలువ సుమారు రూ. 800 కోట్లు కావడం విశేషం.