అప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో.. నేడు రియ‌ల్ హీరో.. మాజీ పేస‌ర్‌కు ఐసీసీ సెల్యూట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2020 7:56 AM GMT
అప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో.. నేడు రియ‌ల్ హీరో.. మాజీ పేస‌ర్‌కు ఐసీసీ సెల్యూట్‌

మాజీ పేస‌ర్ జోగేంద‌ర్ శ‌ర్మ గుర్తున్నాడా.. అదేనండా 2007టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆఖ‌రి ఓవ‌ర్ వేశాడుగా.. ఆ పేస‌ర్‌. పాక‌స్థాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసి భార‌త్‌కు ప్ర‌పంచ‌క‌ప్ ను అందించడంతో.. రాత్రికి రాత్రే ఓవ‌ర్‌నైట్ స్టార్ అయ్యాడు. ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగింద‌ర్.. కెరీర్లో మాత్రం నిల‌క‌డ ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయాడు. కొంత‌కాలానికే జ‌ట్టులో చోటు కోల్పోయిన జోగింద‌ర్‌.. 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

క్రికెట్ నుంచి రిటైరయ్యాక పోలీసు అధికారిగా హ‌ర్యానా రాష్ట్రంలో జోగింద‌ర్ సేవ‌లందిస్తున్నాడు. తాజాగా ఈ మాజీ పేస‌ర్ ఫొటోను షేర్ చేసిన ఐసీసీ.. రియ‌ల్ వ‌ర‌ల్డ్‌ హీరో అంటూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుత కరోనా సంక్షోభ ప‌రిస్థితుల్లో జోగింద‌ర్ పోలీసుగా అద్భుత‌మైన పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు కొనియాడింది. ఇక ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచ్‌లాడిన జోగింద‌ర్‌.. క్రికెట్‌కు చేసిన సేవ‌కుగాను సొంత‌రాష్ట్రం హ‌ర్యానా డిప్యూటీ సూప‌రిటిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉద్యోగాన్ని క‌ల్పించింది.

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది.ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి ప్ర‌పంచ వ్యాప్తంగా 27వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. ఆరుల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా క‌రోనా క‌ట్ట‌డికి ఏప్రిల్ 14 వ‌ర‌కు దేశ వ్యాప్త‌ లాక్‌డౌన్ ను ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి కారణంగా భార‌త్‌లో 21 మంది మ‌ర‌ణించ‌గా.. 933 మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.



Next Story