ఇషాంత్ సిక్స్ కొడితే.. జడేజాకి ధోని చివాట్లు
By తోట వంశీ కుమార్ Published on 21 April 2020 1:14 PM GMTభారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులంతా మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక ధోని కూడా ఎలాంటి సందర్భాలలోనైనా సహనం కోల్పోడు. అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ధోనీ.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పై ఆగ్రహాం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తెలిపాడు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్‌డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. భారత క్రికెటర్లు లాక్‌డౌన్ కాలంలో తమలోని టాలెంట్లను చూపించడంతో పాటు తమ మధురానుభూతులను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం అయిన ఇషాంత్ శర్మ.. తాజాగా ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
2019 ఐపీఎల్‌లో ఇషాంత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లి క్యాపిటల్స్ చెన్నైతో తలపడింది. మొదట ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ మరో మూడు బంతుల్లో ముగుస్తుందనగా.. ఇషాంత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు వికెట్ల వెనుక ఉన్న మహేంద్ర సింగ్ ధోని ఇషాంత్ ను ఆటపట్టించే ప్రయత్నం చేశాడట.
నువ్వు సిక్సర్ కొట్టలేవని, తనలో ఆ సత్తా లేదని.. ధోని అన్నాడట. 'అప్పుడు జడేజా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి బంతిని ఫోర్ కొట్టా.. ఆ తరువాత బంతిని సిక్సర్ బాదా.. తరువాత ధోని వైపు చూశా.. అప్పుడు ధోనీ జడేజాను తిడుతూ.. కనిపించాడు. ఎలా బౌలింగ్ చేస్తున్నావని కసురుకున్నాడదని' లంబూ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.
ఇదిలా ఉంటే.. ఈ భారత పేసర్ పరిమిత ఓవర్ల మ్యాచుల్లో కనిపించడం లేదు. కేవలం టెస్టు మ్యాచుల్లోనే భారత బౌలింగ్ దళానికి నేతృత్వం వహిస్తున్నాడు. టెస్టుల్లో సత్తా చాటుతున్న లంబూ.. వన్డేల్లో, టీ20ల్లో నిరాశపరుస్తున్నాడు. కరోనా కట్టడికి ఈ పేసర్ రూ.20లక్షలను పీఎం కేర్స్‌కు విరాళంగా ఇచ్చాడు.