కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 11:37 AM GMT
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. చిన్నా-పెద్దా, పేద ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి కరోనా సోకింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే ఎంపీ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తన వెంట గత వారం రోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. నెగెటివ్‌ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదిలా ఉంటే.. నిన్న ఏపీలో 10,548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది. 3,12,687 మంది కరోనా నుంచి కోలుకోగా.. 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 3,796 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story
Share it