హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపండి: కేంద్ర మంత్రికి ఎంపీ విజయసాయిరెడ్డి
By సుభాష్ Published on 17 Sept 2020 11:50 AM ISTహైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. వలస కార్మికులు, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో సొంత ప్రాంతాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారని, ప్రజల సౌకర్యార్థం సామాజిక బాధ్యతతో రైల్వేశాఖ దేశ వ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా ఈనెల 21 నుంచి మరో 40 క్లోన్ రైళ్లను నడపనుంది. అయితే ప్రత్యేక రైళ్ల సంఖ్య అతి స్వల్పంగా ఉన్నందున రిజర్వేషన్ దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
లాక్‌డౌన్ సడలింపు అనంతరం ఇటీవల రైల్వేశాఖ అంతర్ రాష్ట్ర ప్రయాణీకుల సౌకర్యార్థం 80 ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. కానీ వాటిలో హైదరాబాద్-విశాఖ, హైదారాబాద్ - తిరుపతి నగరాల మధ్య ఒక్క ప్రత్యేక రైలు కూడా లేని విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు ఇంకా ప్రారంభం కానందున రవాణా కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అత్యధికంగా రాకపోకలు సాగించే విశాఖ, తిరుపతి మార్గాలలో ప్రజా రవాణా చాలా పరిమిత సంఖ్యలో ఉన్నందున సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా కోసం ఖర్చు చేయలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని, దీంతో హైదరాబాద్ నుంచి విశాఖ, హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ఆయన విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిని కోరారు.