ఆ ఆఫీస్‌ పేరు నమ్మకం.. అది ఓపెన్ చేసింది మాత్రం అటెండర్..!

By అంజి  Published on  10 Dec 2019 4:46 AM GMT
ఆ ఆఫీస్‌ పేరు నమ్మకం.. అది ఓపెన్ చేసింది మాత్రం అటెండర్..!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుంటే.. మరోవైపు హత్యలు, అత్యాచారాలో రాష్ట్రం అట్టుడికిపోతందని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా మల్కాజిగిరిలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని గాంధీభవన్‌ అటెండర్‌ షబ్బీర్‌ అలీతో రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. క్యాంప్‌ కార్యాలయాన్ని అటెండర్ షబ్బీర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా షబ్బీర్‌ గాంధీభవన్‌ అటెండర్‌గా ఉంటున్నారు. కాగా షబ్బీర్‌తో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి వినూత్న సంప్రదాయానికి తెరతీశారు. ఎంతోమంది కాంగ్రెస్‌ అగ్రనేతలకు, ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకి అంకితభావంతో సేవలందించానని షబ్బీర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని షబ్బీర్‌ పేర్కొన్నారు.

త్వరలోనే సీఎం కేసీఆర్‌ను అధికార పీఠం నుంచి గద్దెదింపుతామని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సోనియా గాంధీ ముందుకు వచ్చారని తెలిపారు. క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ రేవంత్ పేర్కొన్నారు.

Next Story