రేవంత్ కేసు తీర్పు రేపటికి వాయిదా..

By అంజి
Published on : 10 March 2020 2:51 PM IST

రేవంత్ కేసు తీర్పు రేపటికి వాయిదా..

ముఖ్యాంశాలు

  • రేవంత్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి
  • తీర్పు రేపటికి వాయిదా
  • రేవంత్‌ అరెస్టును ఖండించిన ఫ్రొఫెసర్‌ కోదండరామ్

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ఇరు పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో మెజిస్ట్రేట్‌ లేని కారణంగా బెయిల్‌ పిటిషన్‌ విచారణను కూకట్‌పల్లి కోర్టుకు బదిలీ చేశారు. జన్వాడలోని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ కెమెరా ఎగరవేసిన కేసులో ఏ-1 నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి ఉన్నారు. కాగా ఈ కేసులో రేవంత్‌రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.

ఈ నెల 6న రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో 8 మందిని నిందితులుగా అనుమానిస్తూ నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ వాడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 184, 187, 11 రెడ్‌విత్‌ 5ఏ, ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. గత విచారణలో రాజేంద్రనగర్‌ కోర్టు ఆరుగురికి బెయిల్‌ మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నామని టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. కావాలనే రేవంత్‌రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు.

Next Story