కేసీఆర్, ఓవైసీలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన 'ఎంపీ అరవింద్'
By సుభాష్ Published on 4 Jan 2020 7:42 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గడ్డంలేని వ్యక్తిగా అభివర్ణించారు. అసద్ గడ్డం కోసి కేసీఆర్‌కు అతికిస్తానని, అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన సీఏఏ అవగాహన సదస్సులో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్ల కోసమే పౌరసత్వ చట్టాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ సర్కార్‌కు గానీ, మజ్లిస్‌కు గానీ స్పష్టం చేశారు.
కేసీఆర్ ముస్లింలకే ముఖ్యమంత్రా.. టీఆర్ ఎస్ కు 90 మంది ఎమ్మెల్యేలున్నారు.. హిందువులు ఓట్లేయకుండానే వారు గెలిచారా..? అని ప్రశ్నించారు. మజ్లిస్‌కు కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తన ప్రాంత అభివృద్ది గురించి అసదుద్దీన్ పట్టించుకోవాలని అరవింద్ హితవు పలికారు. సొంత తమ్ముడిని తన ఇలాకాలోనే కత్తులతో పొడిచి, గన్‌తో కాల్చితే.. అసదుద్దీన్ కాపాడుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇక నిజామాబాద్ మేయర్ పదవిని మజ్లిస్‌కు అప్పగించే ప్రయత్నాలు టీఆర్ ఎస్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ గడ్డ.. బీజేపీ అడ్డా అంటూ అరవింద్ నినాదాలు చేశారు.