ఎంపీ అమర్‌సింగ్ కన్నుమూత
By తోట వంశీ కుమార్
రాజ్యసభ ఎంపీ, మాజీ సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సింగపూర్ లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజా కుమారీ సింగ్, కవల కుమార్తెలు ఉన్నారు. అమర్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అమర్ సింగ్ 1956 జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్‌లో జన్మించారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అయితే, ఎస్పీలో ములాయం సింగ్‌తో ఉన్న విబేధాల కారణంగా 2010లో పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకుంది. 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని స్థాపించాడు. అయితే, ఆ పార్టీ అప్పటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. తరువాత అమర్ సింగ్ 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరి పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయాడు. అయితే, 2016లో అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అమర్ సింగ్ ఒకరు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ యూపీఏ కు మద్దతును ఉపసంహరించుకున్న సమయంలో అమర్ సింగ్ చక్రం తిప్పారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన 39 మంది ఎంపీల మద్దతుతో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు.