కన్నతల్లి ప్రేమను దూరం చేసిన కరోనా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jun 2020 9:04 AM GMTమహమ్మారి కోవిడ్ 19 గత రెండు మాసాలుగా భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది. సామాజిక దూరం పాటించకపోతే ఈ వ్యాధి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇక పాజిటివ్ అని వచ్చిన వాళ్లు.. చాలా దూరంగా ఉండాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. ప్రత్యేక గది, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత వాళ్లను కూడా కలవలేని పరిస్థితి..! తండ్రిని కలవలేని బిడ్డలు.. తల్లిని దూరంగా ఉంటూ చూస్తున్న పిల్లలు వంటి ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
భారతదేశంలో మహారాష్ట్రలో కోవిద్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. కోవిడ్ 19 అనేది ఎంత ఉధృతంగా ఉందో అక్కడ నమోదయ్యే పాజిటివ్ కేసులు బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోజు 2000 పైన కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి అంటే వ్యాధి తీవ్రత ఎంత వేగంగా ఉందో అంచనా వేయొచ్చు. మహారాష్ట్రలోని "అలిఫ్యా జవేరి" అనే వివాహితకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.
డాక్టర్లు ఈ విషయం చెప్పిన వెంటనే ఆవిడ అడిగిన మొదటి ప్రశ్న "తన కూతురి కరోనా పరీక్షల ఫలితం గురించి". దేవుని దయ వలన ఆ చిన్నారికి వ్యాధి సోకలేదని తెలిసింది. ఆమెకు స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించారు. దాదాపు రెండు వారాల పాటు ఆ 17 నెలల చిన్నారి తన తల్లికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విషయం మొత్తం జవేరి "హ్యూమన్స్ ఆఫ్ బాంబే" కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
ఈ రెండు వారాలు తన పాప రోజూ తన గది కిటికీ దగ్గరికి వచ్చి పలకరించేది అని, తన భర్త, ఆడ పడుచు పాపను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పింది. నాకు ఇంట్లో ఐసోలేషన్లో ఉండటం కష్టం అనిపించలేదు కానీ తన బిడ్డకు దూరంగా 2 వారాలు ఉండటం చాలా ఇబ్బందిగా అనిపించింది అని వాపోయింది. త్వరలోనే మళ్ళీ తన పాపతో కలుస్తానని యధావిధిగా ముందు లాగే ప్రేమతో పాపను చూసుకుంటా అని తెలిపింది. ఈ పోస్ట్ ను ఫేస్ బుక్ లో 13000 మందికి పైగా లైక్ చేశారు. 600 మందికి పైగా షేర్ చేసారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 46000 మంది పైగా లైక్ చేశారు. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏ తల్లికీ.. ఏ బిడ్డకూ రాకూడదు అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.