దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు

By సుభాష్  Published on  17 Jun 2020 6:18 AM GMT
దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు

జూన్‌ 1న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత నెమ్మదిగా కదులుతూ మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోకి ప్రవేశించి ఇప్పుడు తూర్పు, ఈశాన్యం దిశగా కదులుతున్నాయి. ఇన్నాళ్లు నిదానంగా కదిలిన రుతుపవనాలు తాజాగా వేగం పెంచాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాగల 24 గంటల్లో ఉత్తర ఆరేబియా సముద్రం, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కాగా, ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని కారణంగా ఏపీలోభారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయాయి. మధ్య భారతదేశం మీదుగా తూర్పు, పడమరగా ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి.

ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దియ ద్వీపం అంతా విస్తరించాయి. ఇక గుజరాత్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాలు, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లలో విస్తరించాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

భారత్‌ – చైనా సరిహద్దు.. గాల్వన్ లోయలో ఏం జరుగుతోంది..? ఘర్షణ ఎందుకు..?

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమారుడు.. కల్నల్ సంతోష్‌ జీవిత విశేషాలు

తెలంగాణలో 5,406 కరోనా కేసులు.. ఎక్కడ ఎన్ని కేసులంటే..

Next Story