తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమారుడు.. కల్నల్ సంతోష్‌ జీవిత విశేషాలు

By సుభాష్  Published on  17 Jun 2020 3:18 AM GMT
తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమారుడు.. కల్నల్ సంతోష్‌ జీవిత విశేషాలు

ముఖ్యాంశాలు

  • 15 ఏళ్ల సర్వీసులులో నాలుగు పదోన్నతులు

  • ఎన్నో బంగారు పతకాలు

  • కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ నుంచి కల్నల్‌ స్థాయి వరకు

  • దేశం కోసం అమరుడైన తెలంగాణ బిడ్డ

  • సంతోష్‌ మరణ వార్తతో సూర్యాపేటలో విషాద ఛాయలు

భారత్ - చైనా సరిహద్దుల్లోని లడక్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ, సూర్యాపేటకు చెందిన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు (37) వీరమరణం చెందారు. ప్రస్తుత సమాచారం మేరకు భారత్‌కు చెందిన 20 మంది సైనికుల చనిపోయారని తెలుస్తోంది. ఇక గాయపడిన వారి సంఖ్య కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరమణం చెందిన వారిలో సంతోష్‌ బాబు ఒకరు. ఆదివారం రాత్రే తల్లికి ఫోన్‌ చేసి 'అమ్మా బాగున్నావా' అంటూ పలకరించిన 24 గంటలు గడవకముందే కుమారుడు వీరమరణం పొందడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సంతోష్‌ జననం:

సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యానగర్‌లో బిక్కుమళ్ల ఉపేందర్‌, మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు సంతోష్‌, ఓ కుమార్తె శృతి ఉన్నారు. 1983 ఫిబ్రవరిలో సంతోష్‌ జన్మించారు. సంతోష్ తండ్రి ఉపేందర్‌ ఎస్‌బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత చీఫ్‌ మేనేజర్‌గా రిటైర్‌ అయ్యారు. కానీ సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే తపన ఉపేందర్‌లో ఉండేది. కాని అది నెరవేరక బ్యాంకు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది.

India China War1 సంతోష్‌ తల్లిదండ్రులు

తన కల నెరవేరకపోయినా.. కుమారుని రూపంలో చూడాలని అనుకున్నారు. అనుకున్నట్లే తండ్రి కలను సంతోష్‌ నెరవేర్చాడు. సంతోష్‌ చిన్న నాటి నుంచే చురుకుదనం. 1 నుంచి 5వ తరగతి వరకూ స్థానిక సంధ్య పాఠశాలలో విద్యనభ్యసించాడు. 1993లో 6 నుంచి 12వ తరగతి వరకూ ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత పూణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ పొందారు సంతోష్‌. 2004 డిసెంబర్‌లో లెఫ్‌ట్‌నెంట్‌గా బీహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌లో విధుల్లో చేరాడు. ప్రస్తుతం సంతోష్‌ భార్య సంతుత, కుమారుడు అనిరుధ్‌, కుమార్తె అభిజ్ఞలు ఢిల్లీలో ఉంటున్నారు. కుమార్తె అభిజ్ఞ 3వ తరగతి చదువుతున్నాడు.

ఎన్నో కష్టాలు పడి..

ఎన్నో కష్టాలు పడి తన తండ్రి కలను నెరవేర్చాడు సంతోష్‌. అందుకు నా కల నెరవేరిందని సంతోష్‌ తండ్రి కూడా ఎంతో సంతోషించారు. విధి నిర్వహణలో భాగంగా సంతోష్‌ ఎన్నో బంగారు పతకాలను సాధించాడు.

15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు

కాగా, సంతోష్‌ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందడం విశేషం. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. ఢిల్లీ, కశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయా, లడక్‌, పాక్‌తో ఉన్న సరిహద్దుల్లో కూడా పని చేశారు. కొంత కాలంగా ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లో (కల్నల్‌)కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

India China War2

చైనా సైనికుల ఘర్షణలో సంతోష్‌ వీరమరణం

భారతదేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉండటంతో సంతోష్‌ లడక్‌లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌కు బదిలీ అయినా కరోనా కారణంగా అక్కడే ఉండిపోయారని చెప్పారు. చైనా-భారత్‌ సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్‌ వీరమరణం పొందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషాద వార్త మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనిక అధికారులు ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యుల చేరవేశారు. సంతోష్‌ మరణ వార్త తెలియడంతో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వీరమరణం చెందిన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ పూర్వీకులది మండల పరిధిలోని బొప్పారం గ్రామం. సంతోష్‌ తాత చక్రయ్య గ్రామంలో ఉంటూ వ్యాపారం చేసుకునేవాడు. చక్రయ్యకు ముగ్గురు సంతానం వ్యాపారీ నిమిత్తం సూర్యాపేటలో స్థిరపడ్డారు.

సంతోష్‌ తల్లిదండ్రులను పరామర్శించిన పోలీసు ఉన్నతాధికారులు

సంతోష్‌ మరణ వార్త తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆయన నివాసానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఆర్‌. భాస్కరన్‌, సూర్యాపేట డీఎస్పీ ఎన్‌. మోహన్‌కుమార్‌, సీఐలు ఆంజనేయులు, విఠల్‌ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Next Story