గుడ్‌న్యూస్: జూన్ 1నాటికే రుతుపవనాలు
By సుభాష్ Published on 28 May 2020 3:44 PM ISTభారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు, రైతులకు గుడ్‌న్యూస్ వినిపించింది. ఒక వైపు దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే .. మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడు లేనంతగా తీవ్రంగా ఎండలు దంచికొడుతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ చల్లని కబురు చెప్పింది. జూన్ 1వ తేదీ నాటికే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 31న ఆగ్నేయ, పక్కనే ఉన్న తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ కారణంగా రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయిన తెలిపింది.
రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, గురువారం నాటికి మల్దీవులు-కమోరియన్ ప్రాంతం, మిగతా అండమాన్ దీవుల్లోకి విస్తరించనున్నట్లు ఐఎండీ తెలిపింది. మరో వైపు మే 31 నుంచి జూన్ 4వ తేదీ మధ్య పశ్చిమ మధ్య ఆరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడనుందని, ఈ కారణంగా తుఫాను ఆవర్తనం స్థాయి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. కాగా, రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వచ్చే 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది.
రెండు అల్పపీడనాలు
కాగా, ఆరేబియా సముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఒక వేళ చేపల వేటకు వెళ్లినట్లయితే గురువారం రాత్రిలోగా తిరిగి వచ్చేయాలని సూచించింది. కేరల తీరానికి చేరుకోలేకపోయిన వారు సమీపంలోని తీర ప్రాంతాలకు ఎంత తొందరగా చేరుకుంటే అంత మంచిదని సూచించింది.