గుజరాత్ రాష్ట్రం లోని సూరత్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న 11 సంవత్సరాల కవలల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జైన సన్యాసులైన ఈ కవలలు ‘బాలశతావధానం’ కార్యక్రమంలో తమ అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో మార్చి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆ ఇద్దరు కవలల పేర్లు నమిచంద్రసాగర్ మహారాజ్ సాహెబ్, నెమిచంద్రసాగర్ మహారాజ్ సాహెబ్.. 100 పదాలు చెప్పినా గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఈ కవలల్లో ఉందని మహాశతావధాని అభినందన్సాగర్జీ మహారాజసాహెబ్ తెలిపారు. బేగంబజార్ లోని జైన్ టెంపుల్ లో ఆయన మీడియాతో కవలల బాలశతావధానం కార్యక్రమం గురించి వివరించారు.

ఈ కార్యక్రమాన్ని మెడిటేషన్ రీసర్చ్ ఫౌండేషన్, బాలశతావధాన్ అయిజన్ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కవలలు 100 రకాల పదాలను గుర్తుపెట్టుకుని వాటిని తిరిగి అప్పజెప్పగలరని.. అది వరుసగా అయినా.. రివర్స్ లో అయినా చెప్పగలరట. వీరు ఈ స్థాయికి చేరుకోడానికి కారణం వారి కఠోర శ్రమ, ధ్యానం, యోగ, సంకల్ప శక్తి, ఏకాగ్రత, వారి గురువుల దీవెనలేనని అభినందన్సాగర్జీ తెలిపారు. ఈ కవలలు కేవలం జైన్ ఆగమాల్లోని 7000 శ్లోకాలని మాత్రమే గుర్తుపెట్టుకోవడం కాకుండా భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథ సాహెబ్ లు కూడా కంఠస్థం చేశారని తెలిపారు. అలాగే 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని ఆయన చెబుతున్నారు.

సూరత్ కు చెందిన వీరి అసలు పేర్లు ధృవ్, ధైర్య.. వీరు ఇంతకు ముందే సంయుక్తావధానం, అర్ధశతావధానాన్ని 8 సంవత్సరాల వయసులోనే విజయవంతంగా నిర్వర్తించారు. పూర్తిగా జైనిజం వైపు పిల్లల మనసు లగ్నం అయ్యిందని తల్లి సోనాల్ బెన్, పీయూష్ భాయ్ తెలిపారు. ఈ పిల్లల తండ్రి గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి. ఒకటో తరగతి వరకూ సాధారణ పాఠశాలలో పిల్లలు చదువుకున్నారు. ఆ తర్వాత 9 సంవత్సరాల వయసులో సూరత్ లోనే సన్యాసాన్ని స్వీకరించారు. 5000 కిలోమీటర్లు కాలినడకన తిరిగిన ఈ కవలలు సంస్కృతం, ప్రాక్రిత్, హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, కన్నడ, ఉర్దూ భాషల్లో మోటివేషనల్ స్పీచ్ లను ఇవ్వడం విశేషం. వీరి కార్యక్రమానికి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున జైనులు, శ్రోతలు హాజరుకానున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.